బోనభాగ్యం | - | Sakshi
Sakshi News home page

బోనభాగ్యం

Jun 30 2025 4:11 AM | Updated on Jun 30 2025 4:13 AM

జగన్మాతకు తెలంగాణ బంగారు బోనం

బంగారు బోనంతో జోగిని శ్యామలాదేవి

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): తెలంగాణ హైదరాబాద్‌లోని భాగ్యనగర్‌ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్‌మార్‌ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.

భక్తుల బారులు..

జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు అనుసరించారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్‌కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్‌, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది.

సాదర స్వాగతం..

కళాకారులు, కమిటీ ప్రతినిధులు, భక్తులతో ఘాట్‌రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో శీనానాయక్‌, ఆలయ అర్చకులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎన్‌. రమేష్‌బాబు, వెంకటరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భాగ్యనగర్‌ బోనం 500 మందితో భారీ ఊరేగింపు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు

బోనభాగ్యం 1
1/1

బోనభాగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement