
భూములు ఇచ్చే ప్రసక్తే లేదు
బల్లికురవ: తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పశువులను పోషించుకుంటున్నామని.. అందుకే సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని మండలంలోని ఎస్‌ఎల్ గుడిపాడు గ్రామ రైతులు తేల్చి చెప్పారు. శనివారం గ్రామ సచివాలయం వద్ద చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. గ్రామానికి పడమర వైపు సుమారు 80 ఎకరాలు ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమని, రెండు నెలలుగా ఇప్పటికే మూడు పర్యాయాలు గ్రామ సభ నిర్వహించారు. ఎకరాకు రూ. 16 లక్షల వరకు చెల్లిస్తామని, గ్రామంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, గ్రామాభివృద్ధికి పాటు పడతామని ఆర్డీవో ప్రకటించారు. అయితే రైతులు ఆలకుంట రవిదేవరాజు, శ్రీనివాసరావు, యర్రా బోడెయ్య, రవి, భాస్కరరావు, గుంజి వెంకటేశ్వర్లు, పోతురాజు, అంకమ్మ తదితరులు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో కూడా విన్నవించామని చెప్పారు. తాము ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. స్వయంగా మంత్రే తమ గ్రామ సమీపంలోనే ఎకరా రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారని తెలిపారు. తమ భూముల జోలికి రావద్దని గ్రామ సభ నుంచి రైతులు వెనుదిరిగి వెళ్లారు. తహసీల్దార్ రవినాయక్, ఆర్‌ఐ పోతురాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు
గ్రామసభలో రైతులు విముఖత