
మైనార్టీలను మోసగించిన చంద్రబాబు
కొల్లూరు: మైనార్టీలను సీఎం చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న చంద్రబాబునాయడు పార్లమెంట్‌లో మైనార్టీలకు వ్యతిరేకంగా రూపొందించిన వక్ఫ్ బోర్డు బిల్లుకు పార్లమెంట్‌లో మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలను అణగదొక్కే రీతిలో చట్టాలను చేసుకుంటూ పోతుంటే, వాటికి టీడీపీ మద్దతునిస్తుందన్నారు. చంద్రబాబు రెండు నాలుకల విధానాన్ని అర్థం చేసుకోలేక మైనార్టీలు గత ఎన్నికల్లో మద్దతు నిచ్చి మోసపోయారన్నారు. ముస్లిం సమాజాన్ని వేధించి వారి పూర్వీకులు అల్లా పేరుతో దానం చేసిన భూములు లాక్కొని కార్పొరేట్ మిత్రులకు అప్పగించే విధంగా చంద్రబాబు సర్కారు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ చట్టం అమలు వలన ముస్లిం సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ తొలి నుంచి మైనార్టీలకు అండగా ఉంటూ, వక్ఫ్ బోర్డు బిల్లును ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించబోమని చెప్పిన విషయాన్ని ముస్లిలు గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలపెట్టుకునే అలవాటు ఎన్నడూ లేదని అశోక్‌బాబు విమర్శించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
వక్ఫ్ సవరణ బిల్లు
రాజ్యాంగానికి వ్యతిరేకం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు