బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ | Sakshi
Sakshi News home page

బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ

Published Wed, Dec 6 2023 1:54 AM

- - Sakshi

బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ

 ● 5 వేల మంది బాధితులకు అందజేత  ● మున్సిపల్‌ కమిషనర్‌ భానుప్రతాప్‌ పర్యవేక్షణ  ● పురపాలక సంఘ పనితీరుపై ఎమ్మెల్యే కోన ప్రశంస 

బాపట్ల అర్బన్‌: బాపట్లలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో తుఫాన్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని 5వేల మంది బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని రోటరీ కల్యాణ మండపంలో వంటశాల ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి వంటకాలను చేపట్టారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాలను యుద్ధ ప్రాతిపదికపై సిద్ధం చేశారు. వివిధ వాహనాల ద్వారా బాధితులకు పంపిణీ చేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు, సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌ స్వయంగా పర్యవేక్షించారు. ఎమ్మెల్యే కోన రఘుపతి బాధితులకు అందజేసే ఆహార ప్యాకెట్లను పరిశీలించారు. పురపాలక సంఘం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. బాపట్ల తహసీల్దారు సుధారాణి, మున్సిపల్‌ ఆర్వో సుబ్బారావు, ఏఈ ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐ ఇమామ్‌, మున్సిపల్‌ సిబ్బంది, సచివాలయాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

చీరాల: పట్టణంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో డ్రెయినేజి కాలువలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. భారీ వర్షం కురవడంతో డ్రెయినేజి పొంగి పొర్లుతోంది. మంగళవారం మధ్యాహ్నం అతడిని గుర్తించిన స్థానికులు బయటకు తీశారు. అప్పటికే అతడు మరణించాడు. మద్యం మత్తులో పడిపోయి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్‌ ఆధారంగా అతడి పేరు పోండ్రంగ డాక్టర్‌గా, సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌ వద్ద నివాసముంటున్న వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు ఒన్‌టౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

పంట కాలువలో గుర్తుతెలియని మృతదేహం

మార్టూరు: పంట కాలువలో గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన ఘటన ఇంకొల్లు సమీపంలోని పావులూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామ రైతులు తమ పొలాల సమీపంలో పంట కాలువలు బైక్‌తో సహా ఓ యువకుడు నిర్జీవంగా కనిపించడంతో ఇంకొల్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి పరిశీలించారు. యువకుడు తన్నీరు బ్రహ్మయ్య తండ్రి రామయ్య బీసీ కాలనీ మార్టూరుకు చెందిన వ్యక్తిగా తన జేబులోని బైక్‌ ఆర్సీ ఆధారంగా గుర్తించారు. వివరాలను మార్టూరు పోలీసుస్టేషన్‌కు ఇంకొల్లు పోలీసులు పంపించగా మార్టూరు ఎస్సై శ్రీనివాసరావు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వయసు సుమారు 30 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సత్తెనపల్లి–అమరావతి మార్గంలో వాహనాలు నిలిపివేత

సత్తెనపల్లి: మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావం నియోజకవర్గంలో కొనసాగుతుంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీని ప్రభావం మరింతగా ఉండనుందని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా నియోజకవర్గ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. అధికారులు అప్రమత్తమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పాటుపై నుంచి ఎగువ నుంచి వరద ప్రవహించడం వలన సత్తెనపల్లి మండలం నందిగామ చప్టా పైగా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సత్తెనపల్లి – అమరావతి మధ్య రాకపోకలను మంగళవారం రాత్రి నిలిపి వేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. పోలీస్‌, రెవెన్యూ అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నందిగామ చప్టాపై నుంచి రాకపోకలు నిషేధించడంతో నందిగామ, గుడిపూడి, పెద్దమక్కెన, మీదుగా అమరావతి వెళ్లి, వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.

ఆహార ప్యాకెట్లు సిద్ధం చేస్తున్న మహిళలు
1/2

ఆహార ప్యాకెట్లు సిద్ధం చేస్తున్న మహిళలు

2/2

 
Advertisement
 
Advertisement