సదుం: వైఎస్సార్ సీపీనీ ఓడించేందుకు సర్ (Special Intensive Revision –ప్రత్యేక సమగ్ర సవరణ)ను ఆయుధంగా ఉపయోగించి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దుర్భుద్ధితో సీఎం చంద్రబాబు ఉన్నారని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటరు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో పుంగనూరు నియోజకవర్గ పార్టీ బీఎల్‌ఏలకు శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. వారితో పాటు పార్టీ నాయకులు ఓట్ల సవరణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి వివరించారు.సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికలలో 40 శాతం ఓట్లు వచ్చినా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యామంటే ఎన్నికలు ఎలా జరిగాయో ఆలోచించాలన్నారు. మళ్లీ అటువంటివి పునరావృతం కాకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గత ఎన్నికల మాదిరిగానే మేనేజ్ చేసి మళ్లీ అధికారంలోకి రావచ్చనే భావనతో చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో రూ. 2.63 లక్షల కోట్ల అప్పు చేసినా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కానీ 23 నెలలకే రూ.2.74 లక్షల కోట్లు అప్పు చేసినా సంక్షేమ పథకాల అమలు లేదని, హామీలను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చడం లేదని చెప్పారు. కొత్తగా ఒక పింఛన్ కూడా మంజూరు కాలేదన్నారు. డబ్బంతా అమరావతిలో నీరు పూడ్చేందుకు, మొక్కలు నాటేందుకు, అద్దాలకు, రోడ్లకే వెచ్చించే నెపంతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మాణ పనుల ఖర్చులను చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. పేదరికాన్ని మరింత పెంచేలా పిల్లలను కనాలని కోరుతున్నారని, ఉన్న వారికే చదువు, వైద్యం లభించడం కష్టంగా మారిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని తెలియజేశారు. రెండు నెలల్లోనే జీతాల చెల్లింపు కూడా ఆలస్యమయ్యే దుర్భర పరిస్థితులు రానున్నట్లు చెప్పారు. వారి అక్రమాలను బిజేపీ పెద్దలు సైతం ప్రశ్నించే పరిస్థితులలో లేరని, ఎక్కడ ప్రశ్నిస్తే తమకు దుర్మార్గుడైన చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తాడోనని మిన్నకుంటున్నారని పేర్కొన్నారు. రెండేళ్లుగా ఎంత మంది పార్టీ నాయకులు హత్యలు, కేసులు, దాడులకు గురయ్యారో.. గ్రామాలను వదిలి వెళ్లారో గుర్తుకు తెచ్చుకుని రోషంతో పని చేయాలన్నారు. సర్ కార్యక్రమాన్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తే పార్టీకి విజయం ఖాయమని స్పష్టం చేశారు. భూమన మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో సర్ బలీయమైన ప్రభావం చూపిందని, వారందరికంటే చంద్రబాబు దానిని ఉపయోగించడంలో మరింత నేర్పరి అని చెప్పారు. ప్రతి బూత్ పరిధిలో పార్టీ మద్దతుదారులకు సంబంధించి ఒక్క ఓటు కూడా తొలగకుండా జాగ్రత్త పడాలన్నారు. మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యం కావాలన్నారు. పార్టీ కార్యక్రమాలు మొదటగా పుంగనూరు నియోజకవర్గంలోనే ప్రారంభం అవుతున్నాయని, అలాగే సర్ అవగాహన కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారిగా ఇక్కడ ప్రారంభించామన్నారు. జిల్లాలో చంద్రబాబు భయపడే ఏకై క వ్యక్తి పెద్దిరెడ్డి మాత్రమేనన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి సర్‌లో అక్రమాలు చోటచేసుకోకుండా అడ్డుకోవాలన్నారు. చంద్రబాబు ఇప్పటికే వాళ్ల బీఎల్‌ఏలకు వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లు తొలగించడంపై కుట్రపూరిత శిక్షణ ఇచ్చాడని చెప్పారు. కార్యక్రమంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ చిత్తూరు పార్లమెంటరీ పరిశీలకుడు రాజశేఖర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గ పరిశీలకులు జింకా చలపతి, అనీషారెడ్డి, భరత్, వెంకటేశ్ రెడ్డి, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, రమేశ్ రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, పలు విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అవగాహన సమావేశంలో పెద్దిరెడ్డి, భూమన
ప్రతి ఓటుహక్కు విలువ గుర్తించాలి
రాష్ట్రంలోనే తొలిసారి అన్నమయ్య జిల్లాలో కార్యక్రమం


