పేదల వైద్యంతో చెలగాటం
ప్రభుత్వశాఖల భవనాల కోసం కలెక్టర్ కసరత్తు
సాక్షి రాయచోటి: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్ సీపీ పోరుబాట సంకల్పిస్తోంది. రైతులు..యువకులు.. విద్యార్థులు..మహిళలకు అన్యాయం జరుగుతున్నట్లు తెలిస్తే చాలు.... వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట పడుతోంది. చంద్రబాబు సర్కార్ అధికార పగ్గాలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటోంది. అందుకు అధికారంలో ఉన్న పార్టీ కొన్ని సంక్షేమాలను అమలు చేయకపోగా, ప్రభుత్వం చేపట్టే మరికొన్ని విధానాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్వహించాలని శ్రీకారం చుట్టడాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే నర్సీపట్నం మెడికల్ కళాశాలను పరిశీలించి పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు. అంతకుమునుపే పార్టీ నేతల సమావేశంలో రచ్చబండతోపాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు దూసుకుపోతున్నాయి. ప్రజా సంఘాలతోపాటు వివిధ పార్టీలు కూడా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యవహారాన్ని తప్పుబడుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతలతోపాటు నాయకులు, కార్యకర్తలు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి సంతకాలు సేకరిస్తున్నారు.
ముమ్మరంగా సంతకాల సేకరణ
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రధానంగా జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు కె.సురేష్‌బాబు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాయచోటి, పీలేరు, రైల్వేకోడూరులలో మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు,మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్‌లు స్వయంగా పాల్గొంటూ రచ్చబండతోపాటు కోటి సంతకాల సేకరణ చేపడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఒకవైపు ప్రజల్లో మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై చైతన్య తీసుకు వస్తూనే మరోవైపు కార్యకర్తలు, శ్రేణులను కార్యాన్ముఖులను చేస్తున్నారు. ప్రజలనుంచి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
వైఎస్ జగన్ ఆదేశాలతో ఉప్పెనలా కదిలిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు


