మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు
మదనపల్లె రూరల్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించినట్లు కలెక్టర్ నిశాంత్‌కుమార్ తెలిపారు. శనివారం మదనపల్లె జిల్లా ఏర్పాటు సన్నాహాలకు సంబంధించి, ప్రభుత్వశాఖల భవనాల కోసం సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆయన పట్టణంలోని బీటీ కళాశాల, జీఆర్‌టీ హైస్కూల్, జీఎంఆర్ పాలిటెక్నిక్, రేస్ బీఈడీ కాలేజ్ భవనాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ కార్యాలయాలు ఏర్పాటుచేస్తే బాగుంటుంది. భవనాల విస్తీర్ణం, అందుబాటులోని సౌకర్యాలు, చేయాల్సిన మరమ్మతులు, పార్కింగ్, ఇతర వసతులపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిశాంత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ...నవంబర్ 27న రాష్ట్రప్రభుత్వం మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తూ అభ్యంతరాలు తెలిపేందుకు 30 రోజుల గడువు ప్రకటించిందన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తున్నామన్నారు. ఈనెలాఖరులోపు కొత్త జిల్లా ఏర్పాటుపై పభుత్వం ప్రకటన చేయనుందన్నారు.తహసీల్దార్ కిషోర్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఐ బాలసుబ్రహ్మణ్యం, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం,బీటీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శైలజ తదితరులు పాల్గొన్నారు.


