కిరాయి అడిగితే... డ్రైవర్‌పై దాడి
● బాధితుడికి అండగా రాష్ట్రీయ
చాలక్ ఏక్తా మంచ్ సభ్యులు
● దాడిచేసిన ట్రేడర్స్ యజమానిపై
కేసు నమోదుకు డిమాండ్
● యూనియన్ ప్రెసిడెంట్‌పై
చేయి చేసుకున్న టూటౌన్ సీఐ
యూనియన్ నాయకులను హెచ్చరిస్తున్న టూటౌన్ సీఐ రాజారెడ్డి
పోలీస్ స్టేషన్ ఎదుట లారీ డ్రైవర్‌తో రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ నాయకులు
మదనపల్లె రూరల్ : మహారాష్ట్ర నుంచి లారీలో తీసుకువచ్చిన ఎర్రగడ్డల లోడుకు సంబంధించి కిరాయి అడిగితే రెండురోజులుగా ఇవ్వకపోగా, తమిళనాడుకు చెందిన డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన సయ్యద్ అంజాద్...మహారాష్ట్ర నుంచి మదనపల్లె సంతలోని పీఎం ట్రేడర్స్‌కు ఎర్రగడ్డల లోడు వేసుకువచ్చాడు. సరుకు అన్‌లోడ్ చేసుకున్న తర్వాత ట్రేడర్స్ యజమాని మసూద్‌ను కిరాయి అడిగితే అదిగో, ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. తీరా రాత్రి అయ్యాక, రేపు ఇస్తానని చెప్పడంతో డ్రైవర్ అంజాద్ ఉదయం వరకు వేచి చూశాడు. తర్వాత శనివారం ఉదయం మరోసారి పీఎం ట్రేడర్స్ వద్దకు వెళ్లి బాడుగ ఇవ్వమన్నాడు. వారు ఆలస్యమవుతుంది, వేచి చూడాలని చెప్పడంతో... బాడుగ ఇవ్వలేని వారు లోడ్ ఎందుకు తెప్పించుకున్నారనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. డ్రైవర్‌ను అసభ్యంగా మాట్లాడుతూ, పీఎం ట్రేడర్స్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో డ్రైవర్ అంజాద్, స్థానికంగా ఉన్న రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ యూనియన్ సభ్యులకు ఫిర్యాదు చేశాడు. వారు డ్రైవర్‌కు మద్దతుగా పీఎం ట్రేడర్స్ వద్దకు వెళ్లి బాడుగ ఇవ్వాలని కోరడంతో, మీరు ఎంతమంది వచ్చినా భయపడేది లేదని, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలని ట్రేడర్ యజమాని చెప్పాడు. దీంతో డ్రైవర్స్ యూనియన్ సభ్యులు బాధితుడు అంజాద్‌తో కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడి తరపున కేసు నమోదుచేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇదే విషయాన్ని స్థానికంగా ఉన్న మీడియాకు స్టేషన్ ఎదుట యూనియన్ నాయకులు వివరిస్తుండగా, పోలీసులు స్టేషన్ ముందు న్యూసెన్స్ ఏంటని, వెళ్లిపోవాలని గదమాయించారు. దీంతో యూనియన్ సభ్యులు ఒక్కసారిగా డ్రైవర్స్ యూనియన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టూటౌన్ సీఐ రాజారెడ్డి, రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్.సర్దార్ హుస్సేన్‌ను కాలర్ పట్టుకుని లోపలకు ఈడ్చుకుని వెళుతూ, కొట్టాడు. స్టేషన్‌లో నిందితుడిలాగా కూర్చోబెట్టారు. దీంతో యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం కోసం బాధితుడికి అండగా యూనియన్ నాయకులు వస్తే తమను పనికిమాలినోళ్లు అంటూ వ్యాఖ్యానించడమే కాకుండా చేయి చేసుకోవడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడిపై జరిగిన దాడిని జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళతామన్నారు. డ్రైవర్‌పై దాడి ఘటనలో పీఎం ట్రేడర్స్ యజమాని మసూద్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.
కిరాయి అడిగితే... డ్రైవర్‌పై దాడి


