యథేచ్ఛగా భూ ఆక్రమణలు
అటవీ అధికారుల అదుపులో జేసీబీ యంత్రాలు
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి
పుల్లంపేట : మండలంలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. భూ కబ్జాలను కూటమి నాయకులు దినచర్యగా మార్చుకున్నారు. రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా నిషిద్ధ భూముల్లోకి ప్రవేశించరాదని బోర్డులు పాతినా వారి తీరు మాత్రం మారడం లేదు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అధికారపార్టీ ఆగడాలతో చేసేది లేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మండల పరిధిలోని తిప్పాయపల్లె రెవెన్యూ గ్రామ పరిధిలో దాదాపు 5 రోజుల నుంచి ఆరు జేసీబీలతో దాదాపు 30 ఎకరాల భూమిని దున్నేస్తూ ఆక్రమణకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో అటవీ పరిధిలోని భూమిలోకి వెళ్లడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు ఆక్రమణలు నిలిపివేయించారు. జేసీబీ యంత్రాలను స్వాధీనం చేసుకొని రాజంపేటలోని కార్యాలయానికి తరలించారు. నిత్యం జేసీబీ యంత్రాలతో మండలంలోని ఏదో ఒక రెవెన్యూ గ్రామంలో ఆక్రమణలు జరుగుతుండటంతో తహసీల్దార్ తన సిబ్బందితో కలిసి వెళ్లి అడ్డుకుని ఆయా భూముల్లో హెచ్చరిక బోర్డులు పాతిపెట్టినా ఫలితం లేకుండా పోతోంది. నియోజకవర్గ స్థాయి నాయకుల నుంచి ఫోన్‌లు రావడం, బెదిరింపులు, స్ధానికంగా ఉండే కొందరు దళారులు వీఆర్‌ఓ స్థాయి సిబ్బందితో లాలూచీ పడడం కారణంగా ఆక్రమణలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. ఇటీవల పదిరోజుల క్రితం తిప్పాయపల్లెలో తహసీల్దారు పుల్లారెడ్డి వీఆర్‌ఓ సురేష్‌తో కలిసి బోర్డులు పాతారు. కానీ తహసీల్దారు వెనుదిరిగిన వెంటనే వీఆర్‌ఓ సురేష్‌తో లాలూచీ పడడం పరిపాటిగా మారింది. ఆక్రమణదారులపై పోలీసు కేసులు నమోదు చేసి యంత్రాలను పూర్తిగా సీజ్ చేయడం ద్వారా ఆక్రమణలను అడ్డుకోవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా అటవీ భూముల్లోకి ప్రవేశించిన యంత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం రాజంపేట డీఎఫ్‌ఓను వివరణ కోరగా యంత్రాలను స్వాధీనం చేసుకున్నది నిజమేనని రైతులు అటవీ భూములన్న విషయం తెలియక అటవీ భూముల్లోకి ప్రవేశించారని, యంత్రాలకు జరిమానా విధిస్తామని తెలిపారు.
యథేచ్ఛగా భూ ఆక్రమణలు


