ఉచిత బస్సు ప్రయాణం ఉత్తిదేనా !
పెద్దతిప్పసముద్రం : రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశ పెట్టిన సీ్త్ర శక్తి ఉచిత బస్సు ప్రయాణం ఉత్తిదేనని మండలంలోని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. సీ్త్ర శక్తి పథకం తమకు వర్తించదా, ఆంధ్రాలో ప్రయాణించినా కూడా తమ వద్ద ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తూ పలువురు మహిళలు శనివారం మండలంలోని కుక్కలపల్లిలో బస్సు ఎదుట నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉంది. మదనపల్లి–వన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు బి.కొత్తకోట నుంచి మండల కేంద్రమైన పెద్దతిప్పసముద్రం, కందుకూరు మీదుగా కర్ణాటక రాష్ట్రం చేలూరుకు నడుస్తున్నాయి. అదే విధంగా బి.కొత్తకోట నుంచి టి.సదుం మీదుగా చేలూరుకు కూడా బస్సులు నడుస్తున్నాయి. ఇన్నాళ్లూ ఉచిత బస్సుల్లో మహిళలు ఆధార్ కార్డులు చేతబట్టి ఎంతో సంబరంగా ప్రయాణించేవారు. ఈ నేపథ్యంలో గత ఐదు రోజుల నుంచి ఈ రూట్లలో ప్రయాణించే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించదని ఆర్డీసీ సిబ్బంది తెగేసి చెబుతున్నారు. ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తే ఇది అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసు కావడంతో టికెట్ కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనని కండక్టర్లు చెబుతున్నారు. చివరకు మండల కేంద్రమైన పెద్దతిప్పసముద్రం నుంచి బి.కొత్తకోటకు వెళ్లాలన్నా టికెట్ అడుగుతుండటంతో మహిళలు మండిపడుతున్నారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసు అయినప్పటికీ ఆంధ్రా సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉన్నా ఆర్టీసీ సిబ్బంది మొండిపట్టు పట్టడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కుక్కలపల్లికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ తాను డిపో అధికారులతో ఫోన్‌లో మాట్లాడితే టీడీపీ ఇన్‌చార్జి నుంచి ఫోన్ చేయిస్తే ఆ రూట్లలో తిరిగే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తించేలా చొరవ చూపుతానని సమాధానం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని అసహనం వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు దూర ప్రాంతాలకు వెళ్లే తోటి ప్రయాణికుల అవసరాలను గుర్తించి ప్రజలు నిరసన విరమించారు.
ఆర్టీసీ బస్సు ఎదుట మహిళల నిరసన


