పుష్ప విలాపం | - | Sakshi
Sakshi News home page

పుష్ప విలాపం

Dec 6 2025 7:42 AM | Updated on Dec 6 2025 7:42 AM

పుష్ప

పుష్ప విలాపం

● రూ.3.50 కోట్లు నష్టం

జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షాల కారణంగా పూలతోటలు దెబ్బతినడంతో రూ. 3.50 కోట్ల మేరకు పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో సాగు చేసే పూలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు, కడప, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. పూలు తడకుండా ఉంటే రవాణా, మార్కెట్‌ సౌకర్యం ధరలు రైతులకు అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా తోటల్లో పూలు కోయలేని పరిస్థితి. దీంతో అదునుకొచ్చిన పూలు తోటల్లో రాలిపోవడమో, కుళ్లిపోవడమో జరుగుతోంది. పలువురు రైతులు సాహసం చేసి పూలు కోసి మార్కెట్లకు తరలించినా అక్కడ వర్షాలకు తడిసిన పూలకు గిట్టుబాటు ధరలు ఉండటం లేదు. వ్యాపారులు కనికరిస్తే వారు కోరిన ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొనడంతో రైతులు నష్టపోతున్నారు.

గుర్రంకొండ: ముసురు వర్షాలతో బంతి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పూల ధరలు మార్కెట్లో భారీగా పతనమవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పూలు కోయలేకపోవడంతో రంగుమారిపోతున్నాయి. వీటిని మార్కెట్‌కు తలించినా వ్యాపారులు తక్కువ ధరకే కొనుగొలు చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు.ప్రస్తుతం మార్కెట్లో కిలో పూల ధరలు రూ.12 నుంచి రూ.15కు పడిపోయాయి. పదిహేను రోజుల కిందట కిలో రూ. 50 నుంచి రూ.60 వరకు ధరలు పలికాయి. జిల్లాలోని పూల రైతులకు ముసురు వర్షాల కారణంగా రూ. 3.50కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఈసీజన్‌లో జిల్లాలో 6545 ఎకరాల్లో పూల సాగు చేపట్టారు. ప్రస్తుతం 4952 ఎకరాల్లో తోటలు అదునుకొచ్చి దిగుబడి ప్రారంభమైంది. ఎకరం పూలతోట సాగు చేయాలంటే రూ.1.50లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు వస్తుంది. పూలనారు కొనుగోలు నుంచి పొలం దుక్కులు, డ్రిప్‌మెటీరియల్‌, మల్చింగ్‌ ఖర్చులు రైతులు భరించాల్సి ఉంటుంది. మార్కెట్లో కిలో పూల ధర కనీసం రూ.30 నుంచి 50లోపు ఉంటే పెట్టుబడి అయినా చేతికొస్తుంది.

ముసురుతో దెబ్బతిన్నతోటలు

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బంతిపూల తోటలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించడంలేదని రైతులు వాపోతున్నారు.35 కిలోల పూల బస్తా బెంగళూరుకు తరలించాలంటే రూ. 250 వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పూల ధర రూ.15 పలుకుతోంది. ఈలెక్కన ఒక బస్తా పూలకు రూ.525 మాత్రమే ఒక్కోసారి గిట్టుబాటు లభిస్తుంది. అంతదూరం మార్కెట్‌కు తీసుకెళ్లినా బస్తాపైనా రూ.275 మాత్రమే గిట్టుబాటు అవుతోంది. దీంతో పూలను మార్కెట్లకు తరలించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికే టమాటా తోటల సాగుతో తీవ్రంగా నష్టపొయిన రైతులు బంతి పూలసాగుపై ఆశపెట్టుకోగా వారి ఆశలు అడియాసలయ్యాయి.

వర్షాలతో దెబ్బతిన్న పూలతోటలు

ధరలు భారీగా పతనం

మార్కెట్లో కిలో రూ.15

జిల్లాలో 6545 ఎకరాల్లో పూలసాగు

పెట్టుబడి నష్టపోయాం

రెండు ఎకరాల్లో పూలతోటలు సాగు చేశాను. వర్షాలకు దెబ్బతిన్న పూలకు మార్కెట్లో డిమాండ్‌ లేదు. ప్రస్తుతం ్ల కిలో పూల ధర రూ.15 పలుకుతోంది. గత ఏడాది ఇదే సీజన్‌లో వ్యాపారులు తోటల వద్దకే వచ్చి పూలను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు కొనడానికి ఆసక్తి చూపడం లేదు.దీంతో పెట్టుబడి నష్టపోయాం.

–రెడ్డెమ్మ, పూలరైతు, కొత్తపల్లె

ప్రభుత్వం ఆదుకోవాలి

వర్షాల కారణంగా ప్రస్తుతం మార్కెట్లో పూలధరలు పడిపోయాయి. అష్టకష్టాలు పడి మార్కెట్‌కు పూలను తరలించినా కిలో రూ.15 మాత్రమే పలుకుతున్నాయి. 35కిలోల బస్తాకు కనీసం రూ. 200 కూడా మిగలడంలేదు. ముసురు వర్షాలతో నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – నరసింహులు,

పూలరైతు, గంగిరెడ్డిపల్లె

పుష్ప విలాపం1
1/4

పుష్ప విలాపం

పుష్ప విలాపం2
2/4

పుష్ప విలాపం

పుష్ప విలాపం3
3/4

పుష్ప విలాపం

పుష్ప విలాపం4
4/4

పుష్ప విలాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement