కబ్జా కాండ
అధికారం అండగా
నిమ్మనపల్లె: కూటమిప్రభుత్వంలో టీడీపీ నాయకుల భూదాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అధికార బలంతో లెక్క చేయడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు వారికి అండగా నిలుస్తుండటంతో అక్రమాలకు అడ్డు లేకుండా పోతోంది. మదనపల్లె నియోజక వర్గం నిమ్మనపల్లె మండలంలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ, తన అనుచరులతో కలిసి పశువుల మేతకు కేటాయించిన 25 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమ ణకు ప్రయత్నించిన వైనం వెలుగులోకి వచ్చింది.
25 ఎకరాలకు ఎసరు...
మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ అయ్య వారిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్.1037లో 200 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ గుట్టను వెలమబోడి గుట్ట, నల్లగుట్ట అని స్థానికులు పిలుస్తారు. పరిసర గ్రామాల్లోని పశువుల మేతకు వినియోగించేవారు. ఈక్రమంలో వారంరోజులుగా బాలేవాండ్లపల్లె, దిన్నెమీద జంగంపల్లె, అయ్యవారిపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ ఎంపీటీసీ నాగరాజనాయుడు అండతో అయ్యవారిపల్లెకు సమీపంలో ఉన్న నల్లగుట్టను ఓవైపు చదునుచేయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు జేసీబీలతో గుట్టుచప్పుడు కాకుండా పనులు చేశారు. వర్షాలు పడి భూమి తడిసి ఉండటంతో పనులు సులభంగా చేయవచ్చని భావించి గుట్టను 15 ఎకరాలకు పైగా చదును చేసేశారు. అంతేకాకుండా గుట్టకు మరోవైపున సుమారు 5 ఎకరాల మేర భూమి చదునుచేసి ఆక్రమణకు పాల్పడ్డారు.
కేసులు నమోదుచేయని అధికారులు...
నల్లగుట్టను జేసీబీలతో చదునుచేసి ప్రభుత్వస్థలాన్ని ఆక్రమిస్తున్నారని స్థానికులు కొందరు గురువారం రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో తహసీల్దార్ తపస్విని సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. రెండు జేసీబీ యంత్రాలు పనిచేయడం గమనించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించకుండా, టీడీపీ నాయకుల ఒత్తిడితో జేసీబీలను వదిలిపెట్టారు. ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జేసీబీ యజమానులకు ప్రభుత్వ స్థలంలో నాటేందుకు హెచ్చరిక బోర్డులు చేయించి ఇవ్వాల్సిందిగా సూచించారు. శుక్రవారం మండల ఆర్‌ఐ రమేష్, వీఆర్వో నాగరాజ నల్లగుట్టకు వెళ్లి చదును చేసిన ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు నాటారు. వెలమ బోడిగుట్ట వద్ద చదునుచేసిన 4 ఎకరాల భూమిలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు నాటకపోవడం గమనార్హం.
గుట్టను ఆక్రమించేందుకు టీడీపీ నాయకుల యత్నం
సుమారు 25 ఎకరాలకు పైగా భూమి చదును
వారంరోజులుగా జేసీబీ యంత్రాలతో పనులు
కబ్జా కాండ


