పది లక్ష్యం.. శత శాతం
లక్ష్యసాధనకు దోహదం
రాజంపేట టౌన్ : పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితానికి మలుపులాంటిది. విద్యార్థులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలంటే ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు సైతం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన టైంటేబుల్ వచ్చేసింది. దీంతో పరీక్షలకు కౌంట్‌డౌన్ మొదలైందనే చెప్పాలి. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా వంద రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. దీంతో విద్యాశాఖ అధికారులు శతశాతం ఫలితాల సాధనకు వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళిక శనివారం నుంచి అమలు కానుంది.
వంద రోజుల ప్రణాళిక ఇలా..
డిసెంబర్ 5వ తేదీ నాటికే సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ పూర్తి చేశారు. ఇక శనివారం నుంచి యాక్షన్ ప్లాన్ ప్రారంభం అవుతుంది. అందులో భాగంగా ప్రతిరోజు నాలుగు సెషన్‌లలో విద్యార్థులతో ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి చదివించడం, అందులో వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేస్తారు. మొదటి సెషన్ ఉదయం 9–15 నుంచి 10–40 వరకు, రెండవ సెషన్ 10–50 నుంచి 1–15, మూడవ సెషన్ 1–05 నుంచి 2–30, నాల్గవ సెషన్ 2–40 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఇక 4 నుంచి 5 గంటల వరకు ప్రతి రోజు ఒక సబ్జెక్టుపై స్లిప్ టెస్ట్ నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు ఏ అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుసుకొని మరుసటి రోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఉపాధ్యాయులు లోపనిర్ధారణ బోధనలు చేస్తారు.
ప్రీఫైనల్ పరీక్షలు
ప్రీఫైనల్ పరీక్షలను రెండు మార్లు నిర్వహించనున్నారు. తొలి ప్రీఫైనల్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఇవి ముగిసిన మరుసటి రోజు నుంచి మళ్లీ యథావిధిగా రోజూ నాలుగు సెషన్లలో విద్యార్థులను చదివించి వారి సందేహాలను నివృత్తి చేసి స్లిప్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. రెండవ ప్రీఫైనల్ పరీక్షలు మార్చి 2 నుంచి 12 వరకు జరగనున్నాయి.
ఆదివారాలు, రెండో శనివారాల్లో కూడా
తరగతులు
యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఆదివారాలు, రెండవ శనివారాల్లో కూడా తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆదివారం, రెండవ శనివారాల్లో రెండు సెషన్లు మాత్రమే ఉంటాయి. ఇదిలా ఉంటే టెన్త్ పబ్లిక్ పరీక్షల వరకు ఇటు విద్యార్థులకు అటు ఉపాధ్యాయులకు కేవలం ఆరు రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. అందులో క్రిస్మస్, రిపబ్లిక్ డే, భోగి, సంక్రాంతి, కనుమ, హోలి పండుగలకు మాత్రమే అధికారులు సెలవులు ఇచ్చారు. కాగా వంద రోజుల ప్రణాళికను వివిధ హోదాల్లో ఉండే జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.
కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో జిల్లాలో అత్యుత్తమ ఫలితాల సాధన కోసం జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా హైస్కూల్ మైప్రైడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. నోడల్ అధికారులు వారికి కేటాయించిన పాఠశాలలో టెన్త్ విద్యార్థుల ప్రగతిని పరిశీలించి కలెక్టర్‌కు నివేదిస్తారు.
ఉత్తమ ఫలితాల సాధన కోసం చర్యలు
వంద రోజుల ప్రణాళిక
ప్రత్యేక తరగతుల నిర్వహణ
నేటి నుంచి అమలు
వందరోజుల ప్రణాళిక వందశాతం ఫలితాలు సాధించేందుకు దోహదపడగలదు. ఈ ప్రణాళికను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. యాక్షన్ ప్లాన్ అమలుపై నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవు. విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించేందుకు యాక్షన్ ప్లాన్ దోహదపడగలదు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– సుబ్రమణ్యం, విద్యాశాఖ అధికారి, అన్నమయ్య జిల్లా
పది లక్ష్యం.. శత శాతం


