పారిశుద్ధ్య కార్మికులకు తప్పిన ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులకు తప్పిన ప్రమాదం

Dec 6 2025 7:42 AM | Updated on Dec 6 2025 7:42 AM

పారిశ

పారిశుద్ధ్య కార్మికులకు తప్పిన ప్రమాదం

– అధిక లోడుతో పైకి లేచిన ట్రాలీ వాహనం

రాజంపేట : రాజంపేట పురపాలక సంఘంలోని ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి. డ్రైవర్‌ గంగయ్య, సహాయకుడు రమేష్‌తోపాటు కొందరు పారిశుద్ధ్య కార్మికులు వాహనం ద్వారా పట్టణంలోని చెత్తను సేకరించారు. రాయచోటి రోడ్డులోని శివారు ప్రాంతంలో ఉన్న కంపోస్టుయార్డుకు చేరుకున్నారు. అధికంగా లోడు ఉన్న కారణంగా అకస్మాత్తుగా ట్రాలీపైకి లేచింది. డ్రైవర్‌, సహాయకుడు అప్రమత్తమై కిందికి దూకేసి, ప్రమాదం నుంచి బయటపడ్డారు. వారు కిందికి దిగలేక, వాహనం బోల్తా పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

కమిషనరు ఒత్తిడే కారణమంటున్న కార్మికులు

ట్రాలీ ఆటోలో ఎక్కువ చెత్తను తీసుకెళ్లాలని అధికారులు కార్మికులపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధిక లోడు చెత్తను తీసుకెళ్లాలని కమిషనరు పలుమార్లు ఒత్తిడి చేశారని, అనుకోని ప్రమాదం జరిగితే తమపై ఆధారపడి జీవించే కుటుంబం పరిస్ధితి ఏమిటని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ప్రమాదం జరిగితే దానికి పూర్తి బాధ్యత కమిషనరుదేనని హెచ్చరించారు.

అన్నదమ్ముల మధ్య ఘర్షణ

బి.కోడూరు : మండలంలోని పెద్దుళ్ళపల్లె గ్రామంలో అన్నదమ్ములు ఇరువురి పొలాల మధ్య ఉన్న గట్టు విషయమై ఘర్షణ పడగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తెరంగాని సుబ్బయ్య కుమారులైన సుబ్రమణ్యం, నాగసుబ్బరాయుడు శుక్రవారం తగదా పడ్డారు. సుబ్రమణ్యం పారతో దాడి చేయడంతో నాగసుబ్బరాయుడు తలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడికి బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న బి.కోడూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలో విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎరువుల దుకాణాలపై

వ్యవసాయాధికారుల దాడులు

గుర్రంకొండ : ఎరువుల దుకాణాలపై వ్యవసాయాధికారులు దాడులు నిర్వహించి ప్రభుత్వ అనుమతులు లేని రూ.3,45,603 ఎరువులను సీజ్‌ చేసిన సంఘటన గుర్రంకొండలో జరిగింది. శుక్రవారం రాయచోటి ఏడీఏ శ్రీలత ఆధ్వర్యంలోని వ్యవసాయాధికారుల బృందం స్థానిక గ్రోమోర్‌, కిసాన్‌ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణంలో అన్ని రకాల ఎరువులు, పురుగుల మందులను తనిఖీ చేశారు. స్టాకు, పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వ అనుమతులు లేని ఎరువులు, డ్రిప్‌ ఎరువులను రైతులకు విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. రూ.3,45,603 విలువ చేసే ఎరువులు, డ్రిప్‌ ఎరువులను సీజ్‌ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సీజ్‌ చేసిన ఎరువులను విక్రయించకూడదని హెచ్చరించారు. వాటికి సంబందించిన కొనుగోలు రికార్డులను తమకు అందజేయాలని ఎరువుల దుకాణ యజమానులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో రాజేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

గురుకులానికి నిధులు

బి.కోడూరు : మండలంలోని సగిలేరు వద్ద గల డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.75 లక్షల నిధులు మంజూరు చేసినట్లు ఎంపీడీఓ భాస్కర్‌రావు శుక్రవారం తెలిపారు.

చోరీ కేసుల్లో

నిందితుడి అరెస్ట్‌

కడప అర్బన్‌ : కడప నగరంలో ఐదు చోరీ కేసుల్లో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి మృత్యుంజయకుంటలో నివాసం వుంటున్న ఉదయగిరి పెద్ద కుళ్లాయప్ప అలియాస్‌ లడ్డు అనే యువకుడికి ఐదు దొంగతనాల కేసుల్లో ప్రమేయముంది. ఇతను గతంలో చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు దొంగతనాల కేసులు, ఒక గలాటా కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను, ఇద్దరు మైనర్లతో కలిసి కడప నగరంలోని శంకరాపురం, ఎర్రముక్కపల్లి, ఎన్జీఓ కాలనీ ప్రాంతాలలో ఐదు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా వున్నాడు. ఈ క్రమంలో అతన్ని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి 4.5 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరానికి ఉపయోగించిన స్కూటీ, సెల్‌ఫోన్‌లను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేయడానికి కృషి చేసిన చిన్నచౌక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.ఓబులేసు గారు, చిన్నచౌక్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఎన్‌. రాజరాజేశ్వరరెడ్డి, పి.రవికుమార్‌, హెడ్‌ కానిస్టేబుళ్లు వేణుగోపాల్‌, శివకుమార్‌, కానిస్టేబుళ్లు ఖాదర్‌ హుస్సేన్‌, ప్రదీప్‌ కుమార్‌, ఓబులేసు, మాధవరెడ్డి, నాగరాజు, సుధాకర్‌ యాదవ్‌లను కడప సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ అధికారి ఏ.వెంకటేశ్వర్లు ప్రశంసించి రివార్డుల కోసం ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌కు సిఫార్సు చేశారు.

పారిశుద్ధ్య కార్మికులకు  తప్పిన ప్రమాదం  1
1/1

పారిశుద్ధ్య కార్మికులకు తప్పిన ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement