నాలుగు వరుసల బైపాస్ రోడ్డు మంజూరు చేయండి
● మదనపల్లెలో ట్రాఫిక్ సమస్య
పరిష్కారానికి మార్గం
● మూడు రాష్ట్రాలకు సౌకర్యవంతం
● కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి
ఎంపీ మిథున్‌రెడ్డి వినతిపత్రం
మదనపల్లె : ‘అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. కేవలం ఏడు కిలోమీటర్ల ప్రయాణానికి 30 నిమిషాలకు మించిన సమయం పడుతోంది, ఈ సమస్య పరిష్కారం కోసం మదనపల్లెకు నాలుగు వరుసల బైపాస్‌రోడ్డును మంజూరు చేయాలి, ఇది మూడు రాష్ట్రాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది’ అని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్షనేత, రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించారు. న్యూఢిల్లీలో మంత్రి నితిన్ గడ్కరీని మిథున్‌రెడ్డి కలిశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో లేఖను అందించారు. లేఖ ఇవ్వడంతోపాటు మదనపల్లె పరిస్థితులను మంత్రికి స్వయంగా మిథున్‌రెడ్డి వివరించి రోడ్డును మంజూరు చేయాలని కోరారు. జాతీయ రహదారి–42 నుంచి (మదనపల్లె–అనంతపురంరోడ్డు) మదనపలె పట్టణంలోకి వచ్చి బెంగళూరు రోడ్డులోకి వెళ్లాలంటే ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. కదిరిరోడ్డు నుంచి బెంగళూరు రోడ్డు ఏడు కిలోమీటర్లు ఉండగా పట్టణంలో వాణిజ్య కార్యకలాపాలు, ట్రాఫిక్ రద్దీ, జనసమ్మర్థం కారణంగా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడతున్నారని చెప్పారు. నీరుగట్టువారిపల్లెలో ఆసియాలోనే పెద్ద టమాట మార్కెట్ ఉండటం, ఇక్కడి నుంచి ఉత్తర, దక్షిణ భారతానికి ఎగుమతులు నిత్యం ఉంటాయని, వందల సంఖ్యలో లారీలు వచ్చిపోతున్నందున ట్రాఫిక్ నియంత్రణ కష్టం సాధ్యంగా ఉందన్నారు. మామిడి, వేరుశనగ, చింతపండు, పట్టు వస్త్రాల వ్యాపారంతో రద్దీ తీవ్రంగా ఉంటోందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కదిరిరోడ్డు నుంచి బెంగళూరురోడ్డు (కర్ణాటక వెళ్లే మార్గం) మీదుగా చైన్నెకి వెళ్లే పలమనేరు (పుంగనూరురోడు) మార్గాన్ని కలుపుతూ నాలుగు వరుసలతో బైపాస్ నిర్మిస్తే.. పలమనేరు రోడ్డులోకి కలిసే చోట ఇప్పటికే కదిరిరోడ్డు నుంచి బైపాస్ రోడ్డు ఉందని, ఈ రోడ్డు అందులో కలిసిపోతుందని వివరించారు. దాంతో మదనపల్లె పట్టణం చుట్టూ బైపాస్‌రోడ్డుతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు కర్ణాటక రాజధాని బెంగళూరు, తమిళనాడు రాజధాని చైన్నె, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంతోపాటు సమయం ఆదా అవుతుందని, మదనపల్లె పట్టణ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ బైపాస్‌ను 15 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయాల్సి ఉంటుందని, దీనిపై గతంలోనే లేఖ ఇచ్చానని గుర్తు చేస్తూ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి బైపాస్ రోడ్డును మంజూరు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు.


