రమణీయం.. కాశినాయన రథోత్సవం
● ముగిసిన ఆరాధన మహోత్సవాలు
● జ్యోతిని చూసి తరించిన భక్తులు
కాశినయన : శ్రీ అవధూత కాశినాయన 30వ ఆరాధన మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కాశినాయన సమాధిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు కాశినాయన జ్యోతి స్వరూపం దర్శనం ఇచ్చింది. ఆకాశంలో కాశినాయన జ్యోతిని చూసి భక్తులు తరించారు. అనంతరం కాశినాయన ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా పూలతో అలంకరించి రథంపై ఆశీనులను చేశారు. రథాన్ని భక్తులు లాగుతుండగా మహిళలు ప్రమిదల్లో దీపాలను వెలిగించుకుని గ్రామోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కాశినాయన మాల ధరించిన భక్తులు దివిటీలు చేతబూని రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆరాధన మహోత్సవాలకు 150 క్వింటాళ్లకుపైగా బియ్యం ఖర్చు కాగా అంతకు రెట్టింపు బియ్యాన్ని భక్తులు సమర్పించారు. అధిక మొత్తంలో నగదు సమర్పించారు. రథోత్సవం అనంతరం కాశినాయన విగ్రహానికి పవళింపు సేవ నిర్వహించారు. ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరిగేందుకు ప్రజలందరూ సహకరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. సజావుగా కాశినాయన ఆరాధన మహోత్సవాలు జరిగాయని ఆలయ కమిటీ తెలిపింది.
రమణీయం.. కాశినాయన రథోత్సవం


