వేతనాలు చెల్లించకుంటే బతికేదెలా?
రాజంపేట టౌన్ : అంగన్‌వాడీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుంటే ఎలా బతుకుతారని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు విజయమ్మ, ప్రధాన కార్యదర్శి ఈశ్వరమ్మ అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని శుక్రవారం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేతనాల విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే బ్యాంకు ఖాతాలు మారినందున వేతనాలు జమ కాలేదని చెబుతున్నారని, అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అదే బ్యాంకుకు సంబంధించిన ఖాతాలు కలిగిన వారికి వేతనాలు ఎలా జమ అవుతున్నాయని ప్రశ్నించారు. కేవలం రాజంపేట ప్రాజెక్టు పరిధిలోని ఉద్యోగులకే సమస్య తలెత్తడం ఏమిటన్నారు. నాలుగు రోజుల్లో వేతనాలు బ్యాంక్ ఖాతాలకు జమ చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేసి విధులను సైతం బహిష్కరించేందుకు అంగన్‌వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే ఎల్లాగడ్డ అంగన్‌వాడీ సహాయకురాలి సమస్యను పరిష్కరించాలన్నారు. లేకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు శివరంజని, విజయలక్ష్మీ, శ్రీలక్ష్మీ, అమరావతి తదితరులు పాల్గొన్నారు.


