అనారోగ్యంతో డీఎస్పీ మృతి
సిద్దవటం/కలసపాడు : సిద్దవటం మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న 11వ ఏపీఎస్పీ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ కందుల వెంకటరెడ్డి (60) అనారోగ్యంతో కడప నగరంలోని శ్రీకర ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు బెటా లియన్ పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడు మండలం అ క్కివారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి 1991 మా ర్చి 18న ఆర్‌ఎస్‌ఐగా హైదరాబాద్‌లోని కొండాపూర్ బెటాలియన్‌లో విధుల్లో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 11వ ఏపీఎస్పీ బెటాలియన్‌కు 2020 డిసెంబర్ 23వ తేదీన పదోన్నతిపై డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2024 ఫిబ్రవరి 5న 14వ ఏపీఎస్పీ బెటాలియన్‌కు బదిలీపై వెళ్లి మళ్లీ 11వ బెటాలియన్‌లో 2024 అక్టోబర్ 30న డీఎస్పీగా విధుల్లో చేరారు. బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తూ మండలంలోని మలినేనిపట్నం కాలనీలో నివాసం ఉంటున్నారు. ఊపిరి పీల్చడం కష్టంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనన్ను గురువారం ఉదయం కడప నగరంలోని శ్రీకర ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 7.55 గంటలకు గుండెపోటు తో మృతి చెందినట్లు ఆయన కుమారుడు రాంసంతోష్‌రెడ్డి తెలిపారు. ఈయన భార్య సుజాత గృహిణి కాగా కుమారుడు రాంసంతోష్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేశారు. కుమార్తె డాక్టర్ భవ్యకు డాక్టర్ సహాన్‌తో ఇటీవల వివాహం చేశారు. ఆయన మృతదేహాన్ని బెటాలియన్ పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామానికి తీసుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న బెటాలియన్ కమాండెంట్ ఆనంద్‌రెడ్డి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మంచి అధికారిని కోల్పోవడం బాధాకర విషయమన్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


