దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం
రాయచోటి టౌన్ : భావిభారత నిర్మాణంలో మీరే కీలకపాత్ర పోషించాలని విద్యార్థులకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ సూచించారు. ఏపీ మోడల్ స్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, డొక్కా సీతమ్మ పథకం ద్వారా మధ్యాహ్నం అందించే భోజనం వివరాలు, ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలు, కళలు, సృజనాత్మక కార్యక్రమాల నిర్వహిస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆహారంపై విద్యార్థులను వేర్వేరుగా అడిగి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ విద్య, ఆహారం, భద్రత విషయాలపై ఆరా తీశారు. పరీక్షల ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులలో మానసిక, శారీరక వికాసం కోసం క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి వారం నిర్వహించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు.


