8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
సుండుపల్లె : రాయవరం అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల మేరకు.. టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బరాయుడు కార్యాచరణ మేరకు కడప సబ్ కంట్రోల్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ పి.నరేష్ బృందం స్థానిక ఎఫ్‌బీఓ ఎ.అంజనాస్వాతితో కలసి గురువారం అన్నమయ్య జిల్లా సానిపాయి అటవీ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రాయవరం సెక్షన్ చిన్నముచ్చురాళ్ల గుట్ట వద్దకు చేరుకోగా, అక్కడ కొంత మంది వ్యక్తులు గుమికూడి కనిపించారు. టాస్క్‌ఫోర్స్ టీం వారిని పట్టుకునేందుకు వెంబడించగా వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంబడించి చుట్టుముట్టారు. వారిని ఆధీనంలోకి తీసుకుని చుట్టుపక్కల పరిశీలించగా 12 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని తమిళనాడు కల్లకురిచ్చి జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారిని ఎర్రచందనం దుంగలతో సహా తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ వి.శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె.శ్రీనివాస్ వారిని విచారణ చేశారు. సీఐ ఖాదర్‌బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


