ముగ్గురు మంత్రులు..ఒక్క హామీ లేదు!
రైతు కష్టాలపై కనికరం చూపలేదు
మదనపల్లె: ఏదైనా ఒక ప్రాంతానికి మంత్రి వస్తున్నారంటే అక్కడి ప్రజలు ఎన్నో ఆశలతో తమ ఊరికి ఏదో మంచిచేసి వెళ్తారని ఆశగా ఎదురు చూస్తారు. అలాంటిది ఒకరిద్దరు కాదు ముగ్గురు మంత్రులు మదనపల్లె పర్యటనకు ఇలా వచ్చి..ఒక్క హామీ ఇవ్వకుండానే అలా వెనుదిరిగి వెళ్లడంపై రైతులు, ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం సందర్భంగా సభ జరిగింది. దీనికి పౌరసరఫరాలశాఖ మంత్రి నాదేళ్ల మనోహర్, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రులు మదనపల్లెకు అభివృద్ధి పనులు, యార్డుకు వచ్చే రైతుల సమస్యల పరిష్కారం కోసం హామీలు ఇస్తారని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ముగ్గురు మంత్రులు కూటమి పాలన, అందిస్తున్న పథకాల గురించి చెప్పుకున్నారు. సత్యకుమార్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలకే ప్రాధాన్యత ఇచ్చారు. తనకు అనుబంధం ఉన్న మదనపల్లె గురించి చెప్పుకున్న మంత్రి ఈ ప్రాంతంలో వైద్యరంగ అభివృద్ధి,, సమస్యల పరిష్కారం జోలికి వెళ్లలేదు. మంత్రి నాదేళ్ల మనోహర్ మార్కెట్‌లో రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, వసతులపై మాట్లాడారేకాని ప్రభుత్వం నుంచి సహకారం ఇస్తామని కనీసం హామీ ఇవ్వలేదు. యార్డులోని పౌరసఫరాల గోదామును తరలించడం పెద్ద సమస్య కాదని చెప్పుకున్నారు. పవన్‌కళ్యాణ్ మార్కెట్‌కు వచ్చిన విషయాన్ని ప్రస్తవించడం మినహా అభివృద్ధి, నిధులపై కనీస ఊరడింపు మాటకూడా లేదు. రవాణశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే షాజహాన్‌బాషా యార్డులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడకపోగా ఇక్కడి టమాటను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పుకున్నారు.
మదనపల్లె మార్కెట్ యార్డుకు వచ్చిన ముగ్గురు మంత్రులు..ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం ఆరా తీయలేదు. యార్డు ప్రారంభంలో సభ జరగ్గా అక్కడి నుంచే యార్డు పరిస్థితులు, రైతులు కష్టాలను తెలుసుకునే వీలున్నా ఒక్కమంత్రి కూడా స్పందించలేదు. మార్కెట్‌లో జాక్‌పాట్ విధానం, పది శాతం కమీషన్ వసూలుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల పెట్టుబడి పెట్టిన రైతులకంటే ఇక్కడి వ్యాపారులే కోట్లకు పడగెత్తారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కమీషన్ వసూలును రద్దు చేస్తూ జీవో జారీచేసింది. కనీసం ఈ జీవో అమలు కూడా చేయడం లేదు. అలాగే రైతులు విశ్రాంతికి, తాగునీటికి, మరుగుదొడ్ల సమస్య ఉన్నా పట్టించుకోలేదు. దీంతో ముగ్గురు మంత్రుల పర్యటన రైతులను నిరాశపర్చింది.
రైతులను నిరాశపర్చిన పర్యటన
మార్కెట్ యార్డు సందర్శన లేదు
సమస్యలపై కనీస ఊరడింపు కరువు


