● నిందితులపై కఠిన చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
మదనపల్లె రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. గురువారం మదనపల్లె పర్యటనలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కిడ్నీ రాకెట్ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యుడుగా ఉన్న ప్రభుత్వ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్నారు. ప్రాథమికంగా దర్యాప్తు కోసం చిత్తూరు జిల్లా డీసీహెచ్‌ఎస్, వైద్య బృందాన్ని విచారణకు నియమించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయా అనే విషయమై హైలెవల్ కమిటీ నియమించి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్, క్రిమినల్ ప్రొసీడీంగ్స్‌తో పాటు, విచారణ పూర్తయ్యాక శాఖాపరంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు కిడ్నీ వ్యవహారంలో ఆరుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, దర్యాప్తులో మరింతమంది ప్రమేయం ఉంటే వారిపై శాఖాపరంగా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వైద్యాధికారుల విచారణ..
కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ చక్రధర్‌బాబు ఆదేశాల మేరకు వైద్యాధికారుల బృందం గురువారం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రంలో విచారణ నిర్వహించారు. చిత్తూరు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మాంజలిదేవి ఆధ్వర్యంలో అన్నమయ్యజిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మీనరసయ్య, సీనియర్ సర్జన్ డాక్టర్ హరగోపాల్, అనస్థిషియా స్పెషలిస్ట్ సాయికిషోర్, వైద్యులు హమీద్‌అలీ, ఏఓ ఫణిభూషణ్, సీనియర్ అసిస్టెంట్ విజయ్‌కృష్ణ విచారణ చేపట్టారు. ముందుగా కిడ్నీ బాధితురాలు యమున మృతదేహానికి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించకపోవడంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత డయాలసిస్ విభాగంలోకి వెళ్లి టెక్నీషియన్ బాలరంగడు ఎంత కాలంగా పనిచేస్తున్నాడు. గతంలో అతడిపై ఏమైనా ఆరోపణలు ఉన్నాయా..? రోగులతో అతడి ప్రవర్తన, ఇతర వ్యవహారాలపై విచారించారు. అనంతరం కిడ్నీ రాకెట్‌కు కేంద్రమైన ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ హాస్పిటల్‌కు వెళ్లారు. ఆస్పత్రి మూసివేసి ఉండటంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా డీసీహెచ్‌ఎస్ పద్మాంజలిదేవి మీడియాతో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్‌కు చెందిన జిల్లాస్థాయి వైద్యాధికారి ఆంజనేయులుకు కిడ్నీ రాకెట్‌లో ప్రమేయం ఉందని వార్తలు రావడంతో విచారణ నిమిత్తం వచ్చామన్నారు. విచారణలో తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనరేట్‌కు అందజేస్తామన్నారు.


