
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన కృష్ణమూర్తి, సుజాతమ్మ దంపతుల కుమారుడు కె.వెంకటేష్(35) తన స్వగ్రామంలో రైస్‌మిల్, పౌల్ట్రీఫారం నిర్వహిస్తున్నారు. ఇతడు భార్య కీర్తి, కుమారుడు రేషంత్, కుమార్తె వెన్నెలతో కలిసి మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం మద్యం అలవాటు కారణంగా లివర్ దెబ్బతిని అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆరు నెలలపాటు చిత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మూడునెలల క్రితం ఇంటికి వచ్చి వచ్చాడు. భార్య కీర్తి కోళ్లఫారం నిర్వహణకు వెళ్లగా.. మంగళవారం స్వగ్రామానికి వెళ్లిన వెంకటేష్ బుధవారం రాత్రి వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని అయోధ్యనగర్ సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యాధి నయం కాదనే బెంగతో భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య కీర్తి ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు.