
ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి
గుర్రంకొండ: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని తరిగొండలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగులో పచ్చరొట్ట, జీలుగు,జనుము వంటి ఎరువులను వినియోగించడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. వరి సాగు చేసే ముందు పొలంలో వేప, కానుగ ఆకు వేసి కలయ దున్నుకోవాలన్నారు. తద్వారా పంటకు చీడపీడలు సోకవని, మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. ఎకరం పంటకు యూరియా ఒకటి లేదా రెండు బస్తాల కంటే ఎక్కువగా వినియోగించవద్దన్నారు. అధిక యూరియా వినియోగం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతాయన్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. యూరియాకు బదులుగా నారోయూరియాను పంటసాగులో ఉపయోగించవచ్చన్నారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో వాల్మీకిపురం ఏడీఏ నాగప్రసాద్, ఏవో నాగరత్నమ్మ, సిబ్బంది, రైతులు పాల్గోన్నారు.