
సమస్యలు పరిష్కరించేవరకు పనులు జరగనివ్వం
వేముల : తమ సమస్యలు పరిష్కరించేవరకు టెయిలింగ్ పాండ్ వద్ద ఎలాంటి పనులు జరగనివ్వమని.. సమస్యలపై స్పష్టత ఇచ్చాకే పనులు చేసుకోవాలని కె.కె.కొట్టాల గ్రామస్తులు యురేనియం అధికారులకు సూచించారు. శనివారం ప్రొక్లెయిన్ల సహాయంతో పనులు చేపట్టేందుకు యురేనియం అధికారులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కె.కె.కొట్టాల గ్రామస్తులు టెయిలింగ్ పాండ్ వద్దకు చేరుకుని పనులు చేయవద్దని నిరసనకు దిగారు. దీంతో యురేనియం అధికారులు బాధితులతో చర్చించినా వారు అంగీకరించలేదు. కాగా యురేనియం ముడి పదార్థాన్ని శుద్ధి చేయగా, వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. అయితే టెయిలింగ్ పాండ్ వ్యర్థాలతో నిండే స్థాయికి చేరుకుంది. దీంతో యురేనియం అధికారులు రోజుకు 3వేల టన్నుల ముడి పదార్థాన్ని శుద్ధి చేయాల్సి ఉన్నా.. టెయిలింగ్ పాండ్ తొందరగా నిండిపోయే ప్రమాదం ఉండటంతో ప్రస్తుతం రోజుకు 1500 టన్నులు మాత్రమే ముడి పదార్థాన్ని శుద్ధి చేస్తున్నారు. ఈ లెక్కన ముడి పదార్థాన్ని శుద్ధి చేసిన నాలుగైదు నెలల్లో టెయిలింగ్ పాండ్ నిండుతుందని యురేనియం అధికారులు చెబుతున్నారు. అంతేకాక ఈ లోపు భారీ వర్షాలు కురిస్తే టెయిలింగ్ పాండ్ వర్షపు నీటితో పొర్లిపొయే ప్రమాదం ఉంది. దీంతో యురేనియం అధికారులు ప్రొక్లెయిన్ సహాయంతో టెయిలింగ్ పాండ్ వద్ద మట్టిని పోసే పనులను చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రొక్లెయిన్లను సిద్ధంగా ఉంచుకుని పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపు ఈ సమాచారం కె.కె.కొట్టాల గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులు టెయిలింగ్ పాండ్ వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా పనులు చేయడానికి వీల్లేదనడంతో నిరసనకు దిగారు. యురేనియం వ్యర్థాలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. యురేనియం వ్యర్థాలు దుమ్ము, ధూళి గాలి ద్వారా గ్రామం వైపు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వాదించారు. కిడ్నీ వ్యాధులు, గర్భస్రావాలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయని యురేనియం అధికారులకు విన్నవించారు. టెయిలింగ్ పాండ్ పనులు జరగాలంటే తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు. రాత్రికి రాత్రే ప్రొక్లెయిన్లను టెయిలింగ్ లోనికి పంపి పనులు చేపట్టడంపై గ్రామస్తులు యురేనియం అధికారులను నిలదీశారు. ఇళ్లు, పొలాలు తీసుకుని పరిహారంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని తర్వాతనే పనులు చేసుకోవాలని గ్రామస్తులు తేల్చి చెప్పారు. యురేనియం అధికారులు నవీన్‌కుమార్‌రెడ్డి, టెయిలింగ్ పాండ్ ఇన్‌ఛార్జి నాగరాజులు గ్రామస్తులతో చర్చించారు. మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎలాంటి ఆందోళన చెందవద్దని గ్రామస్తులకు నచ్చజెప్పారు. మీ ప్రకారమే అన్ని జరుగుతాయని, అయితే ఇందుకు సమయం కావాలని, అప్పటివరకు పనులు చేసుకునేందుకు సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఇందుకు గ్రామస్తులు తమ సమస్యలపై హామీ ఇచ్చిన తర్వాతనే పనులు చేసుకోవాలని, అంతవరకు టెయిలింగ్ పాండ్‌లో పనులు చేపట్టవద్దని, పనులు చేస్తే ధర్నాకు వెనుకాడమని హెచ్చరించారు. దీంతో టెయిలింగ్ పాండ్ వద్ద పనులు నిలిచిపోయాయి.
టెయిలింగ్ పాండ్ వద్ద పనులు నిలిపివేయాలని గామస్తుల నిరసన
యురేనియం అధికారులు చర్చించినా పట్టువీడని బాధితులు
నిలిచిపోయిన పనులు