
కార్మికుల సమ్మెతో కారుచీకట్లు
రాయచోటి : మున్సిపల్ ఇంజినీర్ల సమ్మెతో రాయచోటి మున్సిపాలిటీ పురవీధులన్నీ చీకటిమయమయ్యాయి. తమ డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం రాత్రి నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో రెండురోజులుగా పట్టణంలో వీధిలైట్లు వెలగలేదు. జాతీయ రహదారితోపాటు పట్టణంలోని ప్రధాన వీధుల్లో వీధిలైట్ల వెలుగులు లేకపోవడంతో ప్రజలు భయంతో ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అలాగే తాగునీటి సరఫరా రాకపోవడంతో నీటి పాట్లు మొదలయ్యాయి. వెలిగల్లు, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి పంపింగ్ ద్వారా పట్టణానికి నీరు అందిస్తున్నారు. సంబంధిత ఇంజనీర్లు కూడా సమ్మెలో ఉండటంతో వాటిని నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు సాధ్యం కాలేదు. దీంతో రెండు రోజులుగా పట్టణానికి నీటి సరఫరా ఆగిపోయింది.
నీటికోసం ధర్నా....
రాయచోటి మున్సిపాల్టీ పరిధిలో మాసాపేట, ఇందిరమ్మ కాలనీలలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని ఆ ప్రాంతాల ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానికంగా ఉన్న బోరులో సరిపడా నీరు రావడం లేదని కాలనీ ప్రజలు తెలియజేశారు. సదరు నీటి సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి చేశారు. మున్సిపల్ ఇంజినీర్ కార్మికులు సమ్మెలకు వెళ్లడంతో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నీటి సరఫరా అందించే చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ వాసు బాబు తెలిపారు. అలాగే రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలుగుల పునరుద్దరణ కూడా చేపడతామని చెప్పారు.
సమస్యలను పరిష్కరించాలి
రాయచోటి : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలపెంపు, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రామాంజులు డిమాండ్ చేశారు. రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో న్యాయ సమ్మతమైన సమస్యలపై సోమవారం రెండోరోజు నిర్వధిక సమ్మెను ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల రిబ్బన్లను ధరించారు. దీక్షా శిబిరంలో వంటా వార్పుతో నిరసన చేశారు. సమ్మె వల్ల నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ ఇతర అత్యవసర పౌర సర్వీసులకు పలు పట్టణాలు, నగరాల్లో అంతరాయం ఏర్పడినట్లు రామాంజులు పేర్కొన్నారు.కార్మికుల సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ మంత్రి, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. తక్షణమే జోక్యం చేసుకొని కార్మీకుల న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బీవీ రమణ మాట్లాడారు. దీక్షలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఫయాజ్, సలీమ్‌లు పాల్గొని మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ సిబ్బంది అక్బర్, శంకరయ్య, ఈశ్వర్ రెడ్డి, మల్లికార్జున, రమణ, రమేష్, రమాదేవి, వెంకటలక్ష్మీ, మౌనిక, దేవా, కృష్ణారెడ్డి, బ్రహ్మయ్య, శానిటేషన్ వర్కర్స్ చెన్నయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
నిలిచిన నీటి సరఫరా
ఆందోళనలో పట్టణ ప్రజలు

కార్మికుల సమ్మెతో కారుచీకట్లు