
పోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎం.శంకరరావు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు వన్‌టౌన్ సీఐ ఎరిషావలి తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డుకు చెందిన టి.చంద్రశేఖర్, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికల హైస్కూల్ వద్ద 2017 మార్చి, 3న స్కూల్‌కు వెళ్లే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పటి హెచ్‌ఎం పద్మజ ఫిర్యాదు మేరకు, ఎస్‌ఐ మనోహర్ పోక్సో కేసు నమోదు చేశారన్నారు. కోర్టు విచారణ అనంతరం శుక్రవారం చిత్తూరు పోక్సో కోర్టులో నిందితుడు చంద్రశేఖర్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ..5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారన్నారు. నిందితుడికి శిక్ష పడేలా చూసినందుకు వన్‌టౌన్ సీఐ ఎరీషావలి, చిత్తూరు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ టీసీ.సాయిసుధాకర్, కోర్టు కానిస్టేబుల్ ఖాదర్‌వలిలను డీఎస్పీ మహేంద్ర అభినందించారు.
చీటింగ్ కేసులో నిందితురాలిని అరెస్ట్
మదనపల్లె రూరల్: చీటింగ్ కేసులో నిందితురాలైన యువతిని కేరళ పోలీసులు శుక్రవారం మదనపల్లెలో వన్‌టౌన్ పోలీసుల సాయంతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నిందితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బెంగళూరు రోడ్డు నక్కలదిన్నెలో ఉంటున్న సాయిబాబా కుమార్తె రోహిణి(25) 2023లో కేరళ ముక్కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆర్థిక నేరానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఏ–1గా ఉన్న రోహిణి, మదనపల్లెలో తలదాచుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఆమె మదనపల్లెలో ఉన్నట్లు నిర్ధారించుకున్న కేరళ పోలీసులు ఇక్కడకు చేరుకుని వన్‌టౌన్ పోలీసుల సాయంయంతో అమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు డెటాల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని కేరళకు తరలించారు.
టీడీపీ నాయకుడిపై ఫిర్యాదు
రాజంపేట: టీడీపీ క్రియాశీలక కార్యకర్త సుండుపల్లె మండలం తిమ్మసముద్రానికి చెందిన జైష్టం వరుణ్‌పై టీడీపీ నేత చప్పిడి మహేష్‌నాయుడు, అతని అనుచరవర్గం దాడి చేసినట్లు సుండుపల్లె ఎస్‌ఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలి వున్నాయి. మడితాడులో టీడీపీ సంస్ధాగత ఎన్నికల క్రమంలో వరుణ్ అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి కారులో వెళుతుండగా మహేష్‌నాయుడు అనుచరవర్గం తనపై దాడి చేశారని, విచక్షణా రహితంగా కట్టెలతో,ఇనుపరాడ్లతో దాడిచేయగా, ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగు తీశానని వరుణ్ తెలిపారు. తనపై దౌర్జన్యంగా వ్యవహరించి చంపేస్తామని, తమకు హత్య కేసులు కొత్తేమీకాదని బెదిరించారన్నారు. మహేష్‌నాయుడుతోపాటు రెడ్డిచెర్ల అశోక్, కోటకొండ చందు, షేక్ జుబేర్,మనోజ్‌నాయుడు, సంతోష్, నానీ, అశోక్‌నాయుడు, నీకిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ సంస్ధాగత ఎన్నికల్లో మహేష్‌నాయుడు పెత్తనంపై ప్రశ్నించడంతోనే వరుణపైకి దాడికి కారణమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

పోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష