●టీచర్ల కొరత..బోధన ఎలా?
● మెగా పేరెంట్ మీటింగ్‌లో కూటమి నాయకులు, కార్యకర్తల హడావిడి
● అయ్యవార్లకు తప్పని తిప్పలు
● వసతుల లేమి గురించి ప్రశ్నించిన
తల్లిదండ్రులు
● తల్లికి వందనం రూ.15 వేలు వచ్చిందంటూ పిల్లల నోట అబద్ధాలు పలికించారు
రాయచోటి : మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాలనుకున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులకు చేదు అనుభవమే ఎదురైంది. జిల్లాలోని అనేక పాఠశాలలో మెరుగైన వసతులు, నాణ్యమైన భోజనం, మంచి విద్యను అందివాలని అడిగిన విద్యార్థుల తల్లిదండ్రులకు వేదికలను పంచుకున్న కూటమి నాయకులు కార్యకర్తలు నుంచి సరైన సమాధానం కరువైంది. గురువారం జిల్లా వ్యాప్తంగా 2708 పాఠశాలలు, 27 జూనియర్ కళాశాల్లో మెగా పేరెంట్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయచోటిలో నిర్వహించిన పాఠశాల సమావేశానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని మరో పాఠశాలలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పాల్గొన్నారు. సమావేశాల వేదికలపై విద్యార్థులతో మాట్లాడిస్తూ తల్లికి వందనం ద్వారా రూ. 15 వేలు పడిందంటూ విద్యార్థుల నోట అబద్ధాలు పలికించారు. మరికొన్ని పాఠశాలల్లో కూటమి పాలన వచ్చిన తర్వాత పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని విద్యార్థుల చేత చెప్పించారు. రాయచోటి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు ఒకవైపు ధ్వంసమై కనిపించినా అన్ని వసతులు ఉన్నాయని విద్యార్థుల మాటల్లో వినిపించారు. ప్రభుత్వమే 13 వేల రూపాయలు వేసినట్లు ప్రకటిస్తే స్థానిక నాయకులు మాత్రం గొప్పలు చెప్పుకునేలా అబద్ధాలను చిన్నారుల నోట పలికించడం గమనార్హం. జిల్లాలోని పాఠశాల కమిటీ సమావేశాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు హడావుడి, హంగామాలు అధికం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తలనొప్పిగా మారింది. పాఠశాలల్లో తగిన విధంగా వసతులు కల్పించకపోయినా, చదువులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు హంగామా ఏంటంటూ తల్లిదండ్రులు విసుగు చెందారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ఉండడం లేదంటూ విద్యార్థులు తల్లిదండ్రులు సమావేశంలో చర్చించారు. కేవలం మీటింగ్‌లో సమయంలో మాత్రమే పిల్లలకు మంచి భోజనాలు పెడుతున్నారని మిగతా వేళల్లో నాణ్యత కరువైందని అక్కడి పెద్దలకు చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం అందించిన బ్యాగులు కూడా నాణ్యత లేవని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రశ్నించారు. తల్లిదండ్రుల నుంచి ప్రశ్నల వర్షం రావడంతో సమావేశాలు హాజరైన నాయకులు, కార్యకర్తలు కంగుతిన్నారు. పాఠశాలలో వసతులు లేకుండా విద్యార్థులకు ఎలా మెరుగైన విద్యను అందిస్తారంటూ కొంతమంది తల్లిదండ్రులు కమిటీ పెద్దల ఎదుటనే నిలదీశారు. మెగా పేరెంట్స్ కార్యక్రమం సందర్భంగా ప్రతి విద్యార్థి వారి తల్లి పేరు మీద మొక్క నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయలేదన్న విమర్శలు ఉన్నాయి.
అయ్యవార్లకు తప్పని తలనొప్పి..
గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ కార్యక్రమం ఆయా పాఠశాలల్లోని అయ్యవార్లకు తలనొప్పిగా మారింది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమావేశానికి స్థానిక ప్రజాప్రతినిధుల కంటే అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు వేదికను పంచుకోవడంలో పోటీపడ్డారు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులకు ఎవరిని వద్దనాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు.
అరకొర సౌకర్యాలు
తంబళ్లపల్లె : మండల కేంద్రంలోని గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో అరకొర సౌకర్యాలు, నాణ్యతలేని భోజనాలు, టీచర్ల కొరతతో విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమం ఎస్‌ఎంసీ చైర్మన్ రాజన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ పాఠశాలలో ఈ ఏడాది అన్ని తరగతుల్లోనూ 48 మంది ఉన్నారని, 6వతరగతిలో కేవలం 9 మంది మాత్రమే చేరారు. పాఠశాల గురించి అధికారులు పట్టించుకోకపోవడం, ఇంగ్లీషు, సైన్సు బోధించేందుకు టీచర్లు లేకపోవడం ప్రధాన కారణాలన్నారు.
ఓబులవారిపల్లె : నియోజకవర్గంలోని జీవీ పురం, గాదెల పాఠశాల ప్రాథమిక పాఠశాలలో టీచర్ల కొరతతో విద్యార్థుల భవిత ప్రశ్నార్థకమేనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. జీవీ పురం పాఠశాలలో నలభై విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇక్కడ ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం ఒకరు మాత్రమే బోధన చేస్తున్నారు. దీంతో పిల్లలకు సరిగా పాఠాలు చెప్పలేకపోతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. మండల వ్యాప్తంగా 63 ప్రాథమిక పాఠశాలలు ఉండగా అందులో 51 పాఠశాలల్లో ఒకరే ఉపాధ్యాయుడు ఉన్నారని, వారికి రిలీవర్ లేకపోవడంతో దాదాపు 42 మంది బదిలీ అయినా అక్కడే ఉన్నారన్నారు. వెంటనే పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించాలని లేనిపక్షంలో తమ పిల్లల చదువుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
రాయచోటి టౌన్ : జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, జూనియర్ కళాశాలలో గురువారం మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. అయితే ప్రసంగ సమయంలో చిన్న పిల్లలతో అబద్ధాలు చెప్పించారు. బాలికోన్నత పాఠశాలలో అపూర్వ అనే 9వ తరగతి విద్యార్థితో మాట్లాడించారు. ఈ విద్యార్థిని తల్లికి వందనం పథకంలో రూ15,000లు తన తల్లి అకౌంట్‌లో పడ్డాయని చెప్పడంతో పాటు పాఠశాల రూపు రేఖలు పూర్తిగా ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేయించారని. అందుకు ఆయనకు అందరూ కృత/్ఞతలు తెలిపాలని కోరింది. ఈ విధంగా ప్రభుత్వం చిన్న పిల్లలతో కూడా అబద్ధాలు చెప్పించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
పిల్లలతో కూడా అబద్ధాలాడిస్తారా...
పిల్లలతో కూడా అబద్ధాలాడిస్తారా...