
బాబూ.. కుప్పానికేనా నీళ్లు
మదనపల్లె : కుప్పంకు ఈనెల 30న కృష్ణా జలాలు పారిస్తామని చంద్రబాబు ప్రకటించి తన సొంత నియోజకవర్గంపై మమకారాన్ని చాటుకున్నారు. కరువు ప్రాంతమైన తంబళ్లపల్లె నియోజకవర్గంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపై కనీసం పట్టించుకోకుండా శ్రీశైలం పర్యటనలో ఈనెల 30కల్లా కుప్పానికి నీటిని తరలిస్తామని ప్రకటించారు. దీనిపై సీఎం ప్రకటించేశారు, ఇప్పుడెలా అని హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన పుంగనూరు ఉప కాలువ విస్తరణ పనులను రద్దు చేసి కరువు ప్రాంతానికి తీరని ద్రోహం చేసింది. ఇది సరిపోదన్నట్టు కాలువకు లైనింగ్ పనులు చేపట్టి రైతులకు కనీస ప్రయోజనం లేకుండా చేస్తోంది. లైనింగ్ పనులపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు 30నాటికి కుప్పంకు కృష్ణా జలాలు పారిస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేశారు. కుప్పానికేనా నీళ్లు అని తంబళ్లపల్లె రైతాంగం ప్రశ్నిస్తోంది.
20 రోజుల్లో సాధ్యమా
జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో పుంగనూరు ఉపకాలువకు కాంక్రిట్ లైనింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనులపై అధికారుల కనీస పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టాతీరిన పనులు సాగుతున్నా పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. పనులు జరుగుతుండగా నీళ్లు పారిస్తే కాలువ నాణ్యత బట్టబయలయ్యే అవకాశం కూడా ఉంది. దీనికి అధికారులు అంగీకరిస్తారా అన్నది అనుమానమే. ఈ పరిస్థితుల్లో వచ్చే 20 రోజుల్లో లైనింగ్ పనులు పూర్తి కావడం అసాధ్యం. దీనికితోడు పనులు పెండింగ్‌లో పెట్టి నీటిని తరలించాలనుకుంటే ముందుకు వెళ్లవచ్చు. దీనివల్ల పనులకు కలిగే నష్టాలు, ఇబ్బందులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది అధికారులపైనే ఆధారపడి ఉంది. అయితే అధికారులు 30కి నీళ్లను తరలించే సాధ్యాసాధ్యాలపై తర్జన భర్జన పడుతున్నట్టు చెబుతున్నారు. సీఎం ప్రకటించిన తేదికి సాధ్యం కాకపోతే ఏం చేయాలన్న దానిపై సమీక్షించనున్నారని చెబుతున్నారు.
నాలుగు నెలల క్రితమే సత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌లో కృష్ణా జలాలు నిండుగా ఉన్నాయి. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తరలించాల్సిన అవసరం లేదు. 1.681 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా అవి కిందకు పారించక నిలిపివేయడంతో అందులో 300 ఎంసీఎఫ్‌టీ నీళ్లు ఆవిరి అయిపోయి ఉండొచ్చని అంచనా. ఈ నీటిలో కొంత ప్రధానకాలువలోకి మళ్లించినా అవి సద్వినియోగం కాక తరలింపు నిలిపివేశారు. ప్రస్తుత వరదతో శ్రీశైలం ప్రాజెక్టు నిండినా అక్కడి నుంచి అనంతపురంజిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు తరలించుకోవచ్చు. సీఎం ప్రకటించినట్టు 30కి చెర్లోపల్లె నుంచి నీళ్లను పుంగనూరు ఉపకాలువలోకి విడుదల చేస్తే..అవి కాలువలోకి ప్రవహించే నీటి సామర్థ్యం మేరకు ఎన్నిరోజులు తరలించోచ్చో అంచనా వేసి ఆ తరవాత జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని చెర్లోపల్లెకు తరలించాల్సి ఉంటుంది.
తంబళ్లపల్లె రైతాంగం ఆవేదన
30న కృష్ణా జలాలు తరలిస్తామని ప్రకటన
ఇది సాధ్యమేనా అని
చర్చించుకొంటున్న ప్రజలు