
ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలి : కలెక్టర్
రాయచోటి : ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు మార్గదర్శకులను, బంగారు కుటుంబాలను మ్యాప్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గురువారం అమరావతిలోని సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పేదరికం లేని సమాజం– పి–4 కార్యక్రమం, ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్షరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. సంక్షేమ శాఖలు వారి పరిధిలో ఉన్న హాస్టళ్లను అన్నింటినీ తనిఖీ చేసి నివేదికలను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. వ్యాధుల వ్యాప్తి లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
శాకంబరి.. నమోస్తుతే
రాయచోటి టౌన్ : రాయచోటి భద్రకాళి అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాం కావడంతో గురువారం అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, కందలతో అందంగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. శాకంబరి..చల్లంగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. ఆలయ ఈవో డివి రమణారెడ్డి, ప్రధాన అర్చకులు కృష్ణయ్యస్వామి, శంకరయ్యస్వామి, శేఖర్ స్వామి భక్తులు పాల్గొన్నారు.
వైభవం..సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురుపౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు కలశ ప్రతిష్ట, యజ్ఞోపవీతధారణ, మాంగల్యపూజ, కర్పూర హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం సతీసమేతుడైన కోదండరామస్వామికి అర్చకులు పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి తరించారు.కార్యక్రమంలో ఆలయ టీటీడీ సూపరిటెండెంట్ హనుమంతయ్య, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఒంటిమిట్ట మండల ప్రత్యేకాధికారి బ్రహ్మయ్య, ఒంటిమిట్ట ఇన్‌చార్జ్ ఎంపీపీ లక్ష్మీదేవి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
నేత్రపర్వం..బ్రహ్మోత్సవం
రాజంపేట : తాళ్లపాక ఆలయాల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్దేశ్వర స్వామి,చెన్నకేశవ స్వామిని వాహనాల్లో ఊరేగింపు నిర్వహించారు.సిద్దేశ్వర స్వామి నంది వాహనంపై, శ్రీ చెన్నకేశవ స్వామి గరుడవాహనపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు వాహన సేవలో పాల్గొని కాయ కర్పూరం సమర్పించుకున్నారు.కార్యక్రమంలో సర్పంచ్ గౌరీ శంకర్, ఆలయ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది, భక్తులు, కళాకారులు పాల్గొన్నారు.
15 నుంచి మహిళలకు క్రీడా పోటీలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి 17 వరకు ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా మహిళలకు పలు క్రీడలను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి కె, జగన్నాథరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలకు మూడు క్రీడాంశాలు అఽథ్లెటిక్స్, అర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. 22 ఏళ్లలోపు ఉన్న మహిళా క్రీడాకారిణులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.

ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందించాలి : కలెక్టర్