
పేరెంట్స్ మీట్‌పై టీచర్లకు షరతులు
మదనపల్లె సిటీ : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహణపై విద్యాశాఖ అధికారులు షరతులు విధించారు. జిల్లాలో 201 యూపీ , 252 జెడ్పీ ఉన్నత, 1,677 ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుందీ లేనిది ఇతర శాఖ ఉద్యోగి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఆ ఉద్యోగి మెగా పీటీఎం రోజున 30 సెక్షన్ల వీడియో, నాలుగు ఫొటోలు, మొత్తం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రధానోపాధ్యాయులు ఉపయోగిస్తున్న లీప్‌యాప్‌లో సాక్షిగా వచ్చిన వ్యక్తి అప్‌లోడ్ చేయాలని ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు షరతు విధించారు. విద్యాశాఖ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
యాప్‌ల భారంతో సతమతం
ఉపాధ్యాయులకు యాప్‌ల భారం తగ్గించి అన్ని యాప్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, సరికొత్త యాప్ రూపొందిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన తొలి సమావేశంలో ప్రకటించారు. లీప్ యాప్‌ను రూపొందించినా రోజూ మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణ వంటి కార్యక్రమాలతో పాటు స్టాక్ అందిన ప్రతిసారి పాత ఐఎంఎంఎస్‌లో నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల పాఠశాలలకు అందిస్తున్న సన్నరకం బియ్యంపై ఉన్న క్యూర్ కోడ్‌ను స్టాక్ అందిన వెంటనే స్కాన్ చేయాలి. తర్వాత బస్తా ఓపెన్ చేసిన వెంటనే స్కాన్ చేయాలి. విద్యార్థులకు మొక్కలు, ఆపార్ ఐడీ క్రియేట్ వంటి అనేక ఆన్‌లైన్ కార్యక్రమాలతో బోధనకు దూరమవుతున్నాంటూ ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోధనకు దూరంగా టీచర్లు
నిన్న యోగాంధ్ర...నేడు పేరెంట్స్ మీట్ అంటూ టీచర్లను సమావేశాలకు,సన్నాహాలకు పరిమితం చేస్తుండటంతో వారు బోధనకు దూరవుతున్నారు. రెండు వారాల నుంచి తల్లిదండ్రుల సమావేశామంటూ హంగామా చేస్తున్నారు. హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డుల పేరిట చాంతాడంత డేటాను పూరిస్తున్నారు. దీంతో విద్యాబోధన రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది.
మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కోసం ప్రభుత్వం హడావుడి
వారం రోజులుగా బోధనకు దూరంగా ఉపాధ్యాయులు
ఉపాధ్యాయుల పనితీరు కించపరచడమే
మెగా పీటీఎంకు ఇతర శాఖ ఉద్యోగుల పర్యవేక్షించడం ఉపాధ్యాయులను కించపరచడమే. బాహ్య పరిశీలకుల పేరిట ఇతర శాఖ ఉద్యోగులను నియమించడం పాఠశాల నిర్వహణ వ్యవస్థను అవమానించడమే. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
– పి.మధుసూదన్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి

పేరెంట్స్ మీట్‌పై టీచర్లకు షరతులు