
భార్య వెళ్లిపోయిందని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : భార్య తనను వదిలి వెళ్లిపోయిందని మనస్థాపంతో భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన నరసింహులు కుమారుడు వెంకటేష్ (22)కు రెండు సంవత్సరాల క్రితం నిమ్మనపల్లె మండలం కొమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన లిఖితతో వివాహం జరిగింది. ఇటీవల కొంత కాలంగా భార్య, భర్తలతో సఖ్యత లేకపోవడంతో వారం రోజుల క్రితం లిఖిత భర్తను వదిలి వెళ్లిపోయింది. పెద్దలను సంప్రదించినా ఆమె కాపురానికి వచ్చేందుకు నిరాకరించడంతో మనస్థాపం చెందిన వెంకటేష్ ఇంటి వద్ద చీమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.