
లోక్ అదాలత్‌లో 210 కేసులు పరిష్కారం
రాయచోటి టౌన్ : రాయచోటి కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 210 కేసులు పరిష్కరించినట్లు జిల్లా 3వ అదనపు న్యాయమూర్తి సీనియర్ సివిల్ జడ్జి ఎస్. ప్రవీణ్‌కుమార్, జూనియర్ సివిల్ జడ్జి టి. కేశవ, జూనియర్ సివిల్ జడ్జి పి. రాజన్ ఉదయ్ ప్రకాష్‌లు తెలిపారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిష్కారమైన 210 కేసుల్లో 204 కేసులు క్రిమినల్ కేసులు కాగా, మిగిలిన ఆరు సివిల్ కేసులు అని తెలిపారు. ఈ కేసుల ద్వారా కక్షిదారులకు మొత్తం 62 లక్షల, 24 వేల, 466 రూపాయలు చెల్లించినట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రధానంగా భార్యాభర్తలకు సంబంధించిన వివాదంలో 20 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతానికి 15 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. అలాగే ఒక చెక్ బౌన్స్ కేసులో రూ.2,49,000 చెల్లించారన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా సత్వరమే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పీపీటీ రామకృష్ణ, ఏజీపీ మౌనిక, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది పీఎన్ శ్రీనివాసులు, జి.రామచంద్రయ్య, మోహన్ బాబు, కె. చంద్రమోహన్ రెడ్డి, జి. సురేంద్ర, వీవీ రమణ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.