
పురాతన ఆలయం.. సుమనోహర క్షేత్రం
నందలూరు: అన్నమయ్య జిల్లా నందలూరులోని సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. సుందర మనోహర క్షేత్రం..శిల్ప సౌందర్య సోయగం స్వామి భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు. తెలుగురాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ భక్తులు ఉన్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 4న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. 5న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 6న ఉదయం పల్లకీసేవ, రాత్రి హంసవాహనం, 7న ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహవాహనం, 8న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హనుమంతు వాహనం, 9న ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం, 10న ఉదయం సూర్యప్రభ రాత్రికి చంద్రప్రభ వాహనం, 11న ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 13న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం, 14న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.బ్రహ్మోత్సవాలకు వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతల నుంచి భక్తులు వేల సంఖ్యలో రానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.
ప్రత్యేకత: బ్రహ్మమానన పుత్రుడు, త్రిలోక సంచారి నారదుడు నందలూరు గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయలంలో స్వామి వారి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధృవీకరిస్తున్నాయి.
శిల్పకళానైపుణ్యానికి ప్రతీక..
ఈ గుడి చోళుల శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా చెప్పవచ్చు.చోళరాజులు 11వ శతాబ్దంలో ఆలయం నిర్మించి స్వామికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది. చోళ, పాండ్య రాజులు 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు గాలిగోపురం కట్టించాడు. నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్తవరం గ్రామాలను దానంగా ఇచ్చినట్లు శాసనాల్లో ఉంది. కాగా నిరంత్ర అనే రాజు పూర్వం నిరంతపురం గ్రామాన్ని నిర్మించగా, గ్రామం బహుదానది వెల్లువలో కొట్టుకుపోయింది. తర్వాత నలంద అనే రాజు ఈ స్థలాన్ని సందర్శించి నందలూరు పేరుతో గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. తాళ్లపాక అన్నమాచార్యులు వేంకటే శ్వరునిపై పలు శృంగార కీర్తనలు ఈ ఆలయంలో కూర్చొని రచించినట్లు ఆధారాలున్నాయి.
● ఎటువంటి దీపం లేకున్నా..
కోర్కెలు తీర్చే దేవుడు
గర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరతాయనే విశ్వాసం భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. కోర్కెలుతీరాక గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం క్షేత్ర సంప్రదాయంగా వస్తోంది. సంతానం కలగని వారు స్వామిని ప్రార్థిస్తే కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు.
5 నుంచి సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
11న కల్యాణోత్సవం
12న రోథోత్సవం
భారీఎత్తున తరలిరానున్న భక్తులు
సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయాన్ని నిర్మించడం ఒక అద్భుతం.గర్భగుడి ప్రధాన ద్వారానికి వందగజాల దూరం నుంచి కూడా స్వామి చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఏడాదిలో ఏదో ఒకరోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపై ప్రసరించే విధంగా శిల్పులు నిర్మించారు.
స్వామి వారి మూలవిరాట్‌ను గమనిస్తే తిరుమలలోని శ్రీనివాసుడు కటి హస్తంతో తన పాదాలను శరణు కోరండి పునీతులు కండి అని ప్రబోధిస్తుంటే నందలూరులోని శ్రీ సౌమ్యనాథుడు తనను నమ్మి శరణు వేడితే కోరిన కోర్కెలు తీరుస్తానంటూ అభయ హస్తంతో ప్రశాంత స్వరూపుడై దర్శనమిస్తాడు.ఆలయం లోపల విశాలమైన యాగశాల, యోగ నరసింహస్వామి, గణపతి, ఆంజనేయస్వామిలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద కోనేరు ఉన్నది. స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ శ్రీవారి తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా దీనిని నిర్మించారు.ఆలయ కుడ్యాల పైభాగాన మత్స్య ఆకారం కనిపిస్తుంది. బహుదానది వరదల వల్ల ఆలయంలో ఉన్న మత్స్యం ప్రాణంతో నీటిలో కలిసిపోతుందని భక్తుల నమ్మకం.

పురాతన ఆలయం.. సుమనోహర క్షేత్రం