
ప్రొటెక్షన్ వాచర్‌పై ఎలుగుబంటి దాడి
ఒంటిమిట్ట: మండల పరిధిలోని చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం అటవీశాఖ ప్రొటెక్షన్ వాచర్ బొడ్డే వెంకటయ్య (48)పై ఎలుగుబంటి దాడి చేసింది. చింతరాజుపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ నాగు నాయక్ కథనం మేరకు దాసర్లదొడ్డి వద్ద బేస్ క్యాంపు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లలో ఒకరైన బొడ్డే వెంకటయ్యపై రెండుపిల్లలను ప్రసవించిన ఎలుగుబండి దాడి చేసింది. అక్కడే ఉన్న బీట్ ఆఫీసర్ సుబ్రమణ్యంతో కలిసి మిగిలిన ప్రొటెక్షన్ వాచర్లు ముగ్గురు ఎలుగుబంటిని చెదరగొట్టారు. ఈ దాడిలో వెంకటయ్య కుడి మోకాలుకు తీవ్రగాయాలయ్యాయి. ఎఫ్‌బీఓ సుబ్రమణ్యం ఒంటిమిట్ట అటవీశాఖ కార్యాలయానికి సమాచారం అందించగా అటవీశాఖ వాహనంలో వెంకటయ్యను ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగు నాయక్ తెలిపారు.
మహిళా సర్పంచులు నాయకత్వ
లక్షణాలు పెంచుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా) : జిల్లాలోని మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సూచించారు. గురువారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. తొలుత మహత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ మహిళా సర్పంచులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు చైతన్యవంతులు అయితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు.
రేపు జాతీయ లోక్ అదాలత్
కడప అర్బన్: జాతీ య న్యాయసేవాధికారసంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికారసంస్థ కడప ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం 08562 258622, 244622 నంబర్లో సంప్రదించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ సి యామిని, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ గురువారం తెలిపారు.