కౌంటింగ్‌కు సర్వం సిద్ధం | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

Published Thu, May 30 2024 12:00 PM

కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

రాయచోటి: సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జూన్‌ 4న జరిగే కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ , జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌కిషోర్‌ కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌కు వివరించారు. బుధవా రం న్యూఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌ నుంచి రాష్ట్రంలో జూన్‌ 4న నిర్వహించే సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా, పోలీస్‌ కమిషనర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌కుమార్‌ వ్యాస్‌ సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫ రెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌కిషోర్‌, ఎస్పీ బి.కృష్ణారావులు హాజర య్యారు. జిల్లాలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్‌ స్థానం ఉందన్నారు. ఈ సెగ్మెంట్లకు రాయచోటి జిల్లా కేంద్రంలో ఒకే ప్రాంగణంలో పటిష్టమైన భద్రతతో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్‌ కౌంటింగ్‌ చిత్తూరు జిల్లాలో జరుగుతుందన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో అసెంబ్లీ పార్లమెంట్‌ సెగ్మెంట్లకు 12 కౌంటింగ్‌ కేంద్రాలు, పార్లమెంట్‌ పోస్టల్‌ బ్యాలెట్‌కు విడిగా ఒక కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లపై అభ్యర్థులు, ఎలక్షన్‌ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి పూర్తిగా తెలియజేశామన్నారు. కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి రాండమైజేషన్‌ పూర్తి చేసి ఇప్పటికే రెండు రౌండ్ల శిక్షణ పూర్తి చేశామన్నారు. మరొక దఫా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ కౌంటింగ్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో రాత్రి నిద్ర కూడా చేస్తున్నట్లు చెప్పారు. గొడవలు చేసే వారిని, రౌడీషీటర్లను గుర్తించి కౌన్సిలింగ్‌ ఇవ్వడంతో పాటు బైండోవర్‌ చేశామన్నారు. జిల్లా, రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులలో నిఘా ఉంచామన్నారు. రిటర్నింగ్‌ అధికారులు రంగస్వామి, మోహన్‌రావు, హరిప్రసాద్‌, రాఘవేంద్ర, లీలారాణి పాల్గొన్నారు.

ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు

నిరంతరాయంగా కౌంటింగ్‌ ప్రక్రియ జరిగేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు జరగాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిషోర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కౌంటింగ్‌ కేంద్రమైన సాయి ఇంజనీరింగ్‌ కళాశాలలో కౌంటింగ్‌ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్పీ కృష్ణారావుతో కలిసి తనిఖీ చేశారు. ఈవీఎంలను కౌంటింగ్‌ హాల్‌కు తీసుకువచ్చే దారి, ఏజెంట్లు, సిబ్బంది వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్న బారికేడింగ్‌లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్‌ రూములలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల వీడియో ఫుటేజీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌, ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్ల లెక్కింపు సమయంలో విద్యుత్‌ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి అభిషిక్త్‌కిషోర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement