కౌంటింగ్‌ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

Published Fri, May 24 2024 11:30 AM

కౌంటింగ్‌ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు

రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి వివరించారు. గురువారం విజయవాడలోని సచివాలయం నుంచి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌మీనా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌కిషోర్‌తో పాటు డీఆర్‌ఓ సత్యనారాయణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. పార్లమెంటుతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటికీ రాయచోటిలోని సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్‌ ప్రక్రియ చేపడతామన్నారు. పార్లమెంట్‌, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు కౌంటింగ్‌ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్‌ రూముల నుంచి కౌంటింగ్‌ కేంద్రానికి ఈవీఎంలను తీసుకొచ్చే దారిలో సీసీ కెమెరాలు, బ్యారికేడింగ్‌, కౌంటింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ఏజెంట్లు అధికారులకు విడిగా బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని కౌంటింగ్‌ కేంద్రంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. మీడియా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్‌ నిమిత్తం నియమించిన సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌ ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కట్టుదిట్టంగా భద్రత

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాల్‌లో ఓట్ల లెక్కింపు రోజున శాంతి భద్రతలపై జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ జిల్లా ఎస్పీ కృష్ణారావుతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా పరిధిలోని వీఆర్‌ఓలు, రాయచోటి, మదనపల్లి, రాజంపేట డీఎస్పీలు, ఇతరశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జూన్‌ 4వ తేదీన ఆర్‌ఓలు, డీఎస్పీలు సమన్వయంతో శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు. 144 సెక్షన్‌ను పటిష్టవంతంగా అమలు చేయాలన్నారు. ఎలాంటి సమస్య రానివ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజున మూడంచెల భద్రతతో కూడిన అవసరమైన బారికేడింగ్‌, సెక్షన్‌ 144 అమలు తదితర అంశాలపై పూర్తి ప్రణాళికతో సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా ఏ చిన్న పొరపాటు లేకుండా చూసుకోవాలని డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఆర్‌ఓ సత్యనారాయణరావు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్‌ కిషోర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement