ఫేస్​బుక్​ పరిచయం.. వివాహేతర సంబంధం.. కట్​ చేస్తే

- - Sakshi

సిద్దవటం : మండలంలోని చాముండేశ్వరీపేట గ్రామ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సిద్దవటం పోలీసుస్టేషన్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు వివరాలు వెల్లడించారు. సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన రాటాల శ్రీనివాసులుకు కడప నగరం అంగడి వీధికి చెందిన జొన్నాదుల జ్యోత్స్న (31)తో 12 ఏళ్ల కిందట వివాహం అయింది.

వీరి సంసారం కొంత కాలం అన్యోన్యంగా సాగింది. తర్వాత మనస్పర్థలు ఏర్పడటంతో విడిపోయారు. జ్యోత్స్న హైదరాబాద్‌లో నర్సుగా పని చేస్తుండేది. 2018లో సిద్దవటం మండలం నిర్మలగిరి కాలనీలో ఉండే వాకపల్లి సంతోష్‌కుమార్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. వారు అప్పుడప్పుడు చాటింగ్‌ చేసుకుంటూ.. ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేమించుకున్నారు. వివాహేతర సంబంధం కొనసాగించారు. ఈమె ప్రతి నెల వికలాంగుల పింఛన్‌ కోసం మాధవరం–1కు వచ్చేది.

ఆయనకు ఇంకా పెళ్లి కాకపోవడంతో.. తనను చేసుకోవాలని అడుగుతుండేది. 2023 మార్చి 2న హైదరాబాద్‌ నుంచి పెన్షన్‌ తీసుకునేందుకు వచ్చింది. అప్పటికే సంతోష్‌కుమార్‌ తన ఇంట్లో వారిని వేరే ఊరికి పంపించారు. మార్చి 3న రాత్రి ఆ ఇంట్లో వారిద్దరూ కలుసుకున్నారు. తనను వివాహం చేసుకోవాలని ఆమె పట్టుపట్టింది. ఎలా వదిలించుకోవాలనే ఉద్దేశంతో.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే మంచం అల్లే నవారు తాడుతో ఆమె గొంతుకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఒక తెల్లటి సూపర్‌ సంచిలో పెట్టి మరలా దానిపై దుప్పటి కట్టుకొని తన స్కూటీలో తీసుకుపోయి గ్రామ సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో పడేశాడు. మృతురాలి మేనమామ చంద్రమౌళి.. జ్యోత్స్న కనిపించడం లేదని మార్చి 8న సిద్దవటం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

పోలీసులు మహిళ మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. మార్చి 25న సిద్దవటం మండలం చాముండేశ్వరిపేట గ్రామానికి దగ్గరలోని సెయింట్‌ ఆంథోని స్కూల్‌కు పక్కన పాడు బడిన బావిలో గుర్తు తెలియని మహిళ శవం ఉన్నట్లు సమాచారం రావడంతో ఆమె బంధువులు వెళ్లి చూసి గుర్తు పట్టారు. ఈ మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. సంతోష్‌కుమార్‌ బెంగళూరులో ప్రైవేటు కంపెనీలోఉద్యోగం చేస్తుండే వాడు. గ్రామంలో ఏమి జరుగుతుందోనని తెలుసుకోవడానికి అక్కడి నుంచి వచ్చాడు.

పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిసి.. పెద్దపల్లె వీఆర్‌వో నాని వద్ద శనివారం లొంగిపోయాడు. ఆయన సంతోష్‌కుమార్‌ను పోలీసులకు అప్పజెప్పడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. హత్య కేసును ఛేదించిన కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, ఒంటిమిట్ట సీఐ పురుషోత్తంరాజు, ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌, పోలీసులను జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ అభినందించారు. సమావేశంలో సిద్దవటం ఎస్‌ఐ తులసీ నాగప్రసాద్‌, పోలీసులు పాల్గొన్నారు.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top