Vijayasai Reddy: రాజ్యసభ అధ్యక్ష స్థానంలో విజయసాయిరెడ్డి

Vijayasai Reddy as President of Rajya Sabha - Sakshi

ప్యానల్‌ చైర్మన్‌గా గంటపాటు ప్రశ్నోత్తరాల నిర్వహణ

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులైన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తొలిసారి అధ్యక్ష స్థానం నుంచి సభా వ్యవహరాలను నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్యానల్‌ చైర్మన్‌ హోదాలో విజయసాయిరెడ్డి ఆ స్థానంలో కూర్చుని బాధ్యతలు నిర్వర్తించారు. ప్రతిపక్షాలపై ఈడీ కక్షసాధింపు చర్యలపై కాంగ్రెస్‌ సహా ఇతర పక్షాలు చేస్తున్న ఆందోళనల మధ్యే ఆయన గంటపాటు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు.

ఈ సమయంలోనే ఆందోళన చేస్తున్న విపక్షాల తరఫున మాట్లాడేందుకు సభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గేకు అవకాశం ఇచ్చిన విజయసాయిరెడ్డి అనంతరం దీనికి బదులిచ్చేందుకు సభాపక్ష నేత పీయూ‹ష్‌ గోయల్‌కు కూడా అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఆందోళనలు తగ్గకపోవడంతో ప్రతిపక్షాలను సముదాయించేందుకు ప్రయత్నించారు. అందరు తమతమ స్థానాల్లో కూర్చోవాలని, సభా కార్యక్రమాల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ మొదటిసారి బాధ్యతలు నిర్వర్తించిన విజయసాయిరెడ్డికి అభినందనలు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top