AP Govt Schools: ‘స్మార్ట్‌’ పునాది

Technical look to government schools - Sakshi

సర్కారు బడులకు సాంకేతిక సొబగులు

ప్రతి స్కూల్‌కు 4కే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీలు

జిల్లా లో తొలి విడతగా 915 పాఠశాలలకు మంజూరు

మచిలీపట్నం: పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల భవిష్యత్‌కు పటిష్టమైన పునాదులు వేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తూనే, విద్యార్థులకు నాణ్యమైన చదువులు అందించేలా పాఠ్యాంశాల బోధనలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఇంగ్లిష్‌ మీడియం బోధనకు అనుగుణంగా తీర్చిదిద్దిన పాఠ్యపుస్తకాలు ఇప్పటికే కృష్ణా జిల్లాలోని అన్ని స్కూల్‌ కాంప్లెక్స్‌కు చేరుకున్నాయి.

2021–22 విద్యా సంవత్సరంలో బడులు తెరిచిన మొదటి రోజునే వీటిని విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలన్నింటికీ స్మార్ట్‌ టీవీలను సమకూర్చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. నాడు–నేడు మొదటి దశలో ఎంపిక చేసిన జిల్లాలోని 915 పాఠశాలలకు 55 అంగుళాలు, 4కే ఆండ్రాయిడ్‌ టెక్నాలజీతో కూడిన స్మార్ట్‌ టీవీలు సరఫరా అయ్యాయి. విజయవాడలోని జిల్లా స్టాక్‌ పాయింట్‌కు చేరుకున్న టీవీలను సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు ఆధ్వర్యంలో ప్రస్తుతం పాఠశాలలకు చేర్చుతున్నారు.  
 
ఇంగ్లిష్‌ ల్యాబ్‌లతో స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌..
► ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లిష్‌ భాషపై విద్యార్థులు పట్టు సాధించేలా పాఠశాలల్లోతగిన బోధనోపకరణ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసమని ఇంగ్లిష్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 

► ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అందుబాటులో ఉన్న భవనాల్లో ప్రత్యేకంగా ఒక గదిని ఇంగ్లిష్‌ ల్యాబ్‌ కోసం సిద్ధం చేస్తున్నారు. ఇదే గదిలో స్మార్ట్‌ టీవీని అమర్చాల్సి ఉంటుంది. 

► ఇంగ్లిష్‌ భాష, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకునేలా విద్యార్థులకు పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియంలో ముద్రించిన వర్క్‌బుక్స్‌ను విద్యాకానుకలో భాగంగా అందజేస్తున్నందున, వీటిపై తర్ఫీదు ఇవ్వనున్నారు.

స్మార్ట్‌గా పాఠ్యాంశాల బోధన..
► ఇంగ్లిష్‌ మీడియం బోధనతో పాటు, 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ విధానం అమలు చేయాలనే సీఎం నిర్ణయానికి అనుగుణంగా అధికారులు చకా చకా ఏర్పాట్లు చేస్తున్నారు.

► నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి దశలో 1,153 పాఠశాలలు ఎంపిక చేయగా, ఇందులో హైస్కూళ్లలో ఇప్పటికే డిజిటల్‌ తరగతుల నిర్వహణకు అనువైన మెటీరియల్‌ ఉంది. మిగిలిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రస్తుతం స్మార్ట్‌ టీవీలు మంజూరయ్యాయి. 

► జిల్లాకు గతంలో 165 టీవీలు రాగా, వాటిని ఇప్పటికే పాఠశాలలకు పంపిణీ చేశారు. తాజాగా మరో 750 టీవీలు సరఫరా అయ్యాయి. వీటిని డివిజన్ల వారీగా నేరుగా స్కూళ్లకు అందజేస్తున్నారు.

విద్యార్థులకు ఎంతో మేలు
సాంకేతికతను అందిపుచ్చుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠ్యాంశాల బోధనకు స్మార్ట్‌ టీవీలు ఎంతో ఉపయోగపడతాయి. వినడం, చూడటం ద్వారా ఇంగ్లిష్‌ భాషపై విద్యార్థులు పట్టు సాధించవచ్చు. పాఠశాలల్లో వీటి ఏర్పాటుకు తగిన ఆదేశాలు ఇచ్చాం.
– యూవీ సుబ్బారావు, డిప్యూటీ డీఈఓ, మచిలీపట్నం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top