ఆక్సీమీటర్‌పై ఆసక్తి!

Special Story On Pulse‌ Oximeters - Sakshi

కరోనా నేపధ్యంలో పల్స్‌ ఆక్సీమీటర్లకు పెరిగిన డిమాండ్‌

అధికంగా కొనుగోలు చేస్తున్న హోం ఐసోలేషన్‌  రోగులు

రక్తంలో ఆక్సిజన్, పల్స్‌ తెలుసుకుంటున్న వైనం

అందరికీ అవసరం లేదంటున్న వైద్యులు  

ఆక్సిజన్‌ను సమస్త ప్రాణికోటికి ప్రాణవాయువు.. కూడు, నీరు లేకపోయినా కొన్ని రోజులు బతకొచ్చుగానీ, గాలి (ఆక్సిజన్‌) లేకపోతే నిమిషం కూడా బతకలేం. అటువంటి ప్రాణవాయువు ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి సరఫరా అవుతుంటుంది. ఊపిరితిత్తుల్లో ఏదేని సమస్య ఏర్పడితే ఆక్సిజన్‌ సరైన మోతాదులో రక్తంలోకి చేరదు. రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గేకొద్దీ రోగికి తీవ్ర ఇబ్బంది ఏర్పడి, ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత కరోనా వైరస్‌ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుండడంతో చాలా కొద్దిమందిలో ఆయాసం సమస్య ఏర్పడుతోంది. దీంతో రక్తంలో ఆక్సిజన్‌ శాతం తెలుసుకునేందుకు పలువురు బాధితులు పల్స్‌ ఆక్సీమీటర్‌లను ఆశ్రయిస్తున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా బాధితుల్లో ఆయాసం ఒక సమస్యగా మారింది. ఊపిరి తిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మన తీసుకునే ఆక్సిజన్‌ సరైన మోతాదులో రక్తంలోకి చేరకపోవడంతో ఈ సమస్య తలెత్తుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితిలో రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగిన మోతాదులో ఉందా? ఎంత ఉండాలి? ఎంత  ఉండకూడదు అనే అంశాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. గుండె వేగం ఎంత కొట్టుకుంటోంది? పల్స్‌ సాధారణం కన్నా ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అని తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్‌ వచ్చినా, ఎలాంటి లక్షణాలు లేకుండా హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్న వారు పల్స్‌ ఆక్సీ మీటర్‌ (ఫింగర్‌ డివైజ్‌)ను కొనుగోలు చేస్తున్నారు. వారితో పాటు కరోనా సోకని వారు సైతం పల్స్‌ ఆక్సీమీటర్‌లు కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకుంటున్నారు. పలు జిల్లాలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి మందుల కిట్‌లో పల్స్‌ ఆక్సీమీటర్‌లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది.   

మార్కెట్‌లో పలు రకాల డివైజ్‌లు 
నెలరోజులుగా ఫింగర్‌ పల్స్‌ ఆక్సీమీటర్‌లకు డిమాండ్‌ పెరిగింది. కరోనా వచ్చినా ఇంట్లోని ఉండి వైద్యం పొందే వారు ఈ మీటర్‌లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు కంపెనీల పల్స్‌ ఆక్సీమీటర్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ధర రూ.1300 నుంచి రూ.2000 వరకూ పలుకుతోంది. ప్రస్తుతం ఈ మీటర్‌లకు డిమాండ్‌ పెరుగుతుండటంతో మార్కెట్‌లో ధరలు సైతం పెంచేశారు. కంపెనీని బట్టి పల్స్‌ ఆక్సీమీటర్‌ల ధరలు ఉన్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ కూడా ఈ మీటర్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇలా తెలుసుకోవాలి.. 
పల్స్‌ ఆక్సీమీటర్‌ను వేలికి పెట్టుకుంటే, దానిపై డిజిటల్‌ అంకెలు కనిపిస్తాయి. పల్స్‌ ఎంత ఉంది, రక్తంలో ఆక్సిజన్‌ ఎంత ఉందో సూచిస్తుంది. ప్రతి వ్యక్తికి రక్తంలో ఆక్సిజన్‌ 100 శాతం ఉండాలి. అయితే 95 వరకూ సాధారణంగానే పరిగణిస్తారు. కాగా 90 నుంచి 95 శాతం మధ్యలో ఉంటే మోడరేట్‌గా భావిస్తారు. 90 శాతం కన్నా తక్కువ ఉంటే ప్రమాదకరంగా భావించి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాల్సి ఉంటుంది. అంతేకాక ఒకసారి ఆక్సిజన్‌ శాతం చూసినప్పుడు 97 ఉందనుకుందాం.. ఆరు నిమిషాలు పాటు వాకింగ్‌ చేసిన తర్వాత ఐదు శాతం కంటే ఎక్కువ (92 శాతం కంటే) తగ్గితే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. కరోనా రోగులకు 3 శాతం తగ్గినా చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆక్సిజన్‌తో పాటు, పల్స్‌ను కూడా తెలుసుకోవచ్చు. పల్స్‌ 70 నుంచి 100 మధ్యలో ఉంటే సాధారణంగా భావిస్తారు. 60 కన్నా తక్కువ ఉంటే హార్ట్‌ రేటింగ్‌ తగ్గిందని, 100 కంటే ఎక్కువుగా ఉంటే పెరిగినట్లు పరిగణిస్తారు.

రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి 
సాధారణం  : 95 – 100 శాతం 
మోడరేట్‌  : 90– 95 శాతం 
ప్రమాదకరం : 90 శాతం కంటే తక్కువ 

పల్స్‌ రేటు  
సాధారణం : 70 – 100 
ప్రమాదకరం : 60 కంటే తగ్గడం,
                 100 కంటే పెరగడం 

కరోనా బాధితులకు ఎంతో అవసరం 
ప్రస్తుతం కరోనా సోకినా ఎంతో మంది ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. అలాంటి వారు నిత్యం పల్స్, ఆక్సిజన్‌ శాతం చూసుకునేందుకు పల్స్‌ ఆక్సీమీటర్‌ ఉంటే మంచిదని భావిస్తున్నారు. ఎందుకంటే వారు బయట ఆస్పత్రికి వెళ్లి పల్స్, ఆక్సిజన్‌ శాతం చూయించుకునే అవకాశం ఉండదు. అందుకే ఇంట్లోనే ఉండి ఫింగర్‌కు డివైజ్‌ పెట్టి సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే కొద్దిపాటి ఆయాసం వచ్చినప్పుడు, ఆక్సిజన్‌ శాతం తగ్గకున్నా, ఏదో జరిగిపోతుందనే ఆందోళన పెరిగిపోతుంది. అయితే గతంలో ఇతర కాంప్లికేషన్స్‌ ఉన్నవారు మాత్రమే కొనుగోలు చేస్తే మంచింది. లక్షణాలు లేని, మైల్డ్‌ లక్షణాలు ఉన్నవాళ్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
– డాక్టర్‌ ప్రసన్నకుమార్, ఫిజీషియన్, విజయవాడ ప్రభుత్వాస్పత్రి   

Election 2024

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top