వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీతో మరో జన్మ

Special Story About YSR Aarogyasri - Sakshi

వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే 2,434 వైద్య ప్రక్రియలకు ఆరోగ్యశ్రీ 

రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేసే ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఇది ప్రతి ఒక్కరి ప్రాణం విలువ తెలిసిన మనసున్న ప్రభుత్వం 

17 నెలలుగా ఎన్నో కార్యక్రమాలు, పథకాల అమలు

కోవిడ్‌తో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనా సంక్షేమ పథకాల కొనసాగింపు

కొత్తగా 16 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటు

3 క్యాన్సర్‌ ఆస్పత్రులు, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆస్పత్రులు

గిరిజనులకు ఐటీడీఏల పరిధిలో 6 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు

ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా సచివాలయాల ఆరోగ్య సహాయకులు

ఆరోగ్య మిత్రల సమన్వయంతో రోగులకు సహాయం

 సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ మరో జన్మనిచ్చే పథకమని, ఆస్తులు అమ్ముకునే అవసరం లేకుండా నిరుపేదలు, నిస్సహాయులకు తన ఖర్చుతో ప్రభుత్వమే వైద్యం చేయించే పథకమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇది ప్రజల గుండె చప్పుడు తెలిసిన ప్రభుత్వమని, ఇది ప్రతి ఒక్కరి ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వమని, ఇది బతికించే మనసున్న ప్రభుత్వమని స్పష్టం చేశారు. పేదలు, సామాన్యులకు అండగా నిలిచే ఆరోగ్య శ్రీ పథకం అమలు తనకు ఎంతో సంతృప్తి, సంతోషాన్ని ఇస్తోందన్నారు. వైద్యం బిల్లు వెయ్యి రూపాయలు దాటితే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింప చేసే ప్రక్రియను రాష్ట్రంలోని మిగిలిన ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలకు విస్తరించే కార్యక్రమాన్ని మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ప్రారంభించారు. దీంతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన 234 చికిత్సలను కలిపి మొత్తం 2,434 వైద్య చికిత్సలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింప చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కలెక్టర్లు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ లబ్ధిదారులను ఉద్ధేశించి వీడియో కాన్పరెన్స్‌లో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పథకం అన్నది ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని, దేవుడి దయతో ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. 

ఆరోగ్యశ్రీ ఒక ప్రత్యేక పథకం

  • మరో జన్మనిచ్చే ఈ పథకాన్ని మన ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుకు వేసి మరింత గొప్పగా మారుస్తోంది. అందుకే ఇతర పథకాలకు భిన్నంగా ఈ పథకాన్ని చూడాలి. ఈ పథకం అమలు చేసేటప్పుడు మనసు బాగుండాలి. ప్రతి అధికారి దీన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. 
  • గతంలో ఎప్పడూ లేని విధంగా ఈ పథకం అమలు దిశలో అడుగులు వేశాం. ఈ 17 నెలల్లోనే, కోవిడ్‌ కష్టకాలంలోనే ఆర్థికంగా కనీవినీ ఎరగని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ వైద్య ఆరోగ్య రంగం మీద మమకారంతో ఎన్ని అడుగులు వేశామో అందరికీ తెలుసు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద 2,434 చికిత్సలను అందుబాటులోకి తెచ్చాం. 

పక్కాగా పథకం

  • రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలను ఈ పథకం పరిధిలోకి తెచ్చాం. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి వర్తింపచేశాం. దీని వల్ల దాదాపు 95 శాతం కుటుంబాలకు పథకం వర్తిస్తోంది.
  • ఈ ఏడాది జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో 2,059 చికిత్సలతో పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభించాం. అదే సమయంలో మిగిలిన జిల్లాల్లో 1,313 రకాల చికిత్సలను పథకంలోకి తీసుకువచ్చాం.

అప్పుడు.. ఇప్పుడు..  

  • మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కేవలం 1,059 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవి. ఆ ప్రభుత్వానికి వాటికి కూడా సరైన వైద్యం అందించే మనసు లేదు. 
  • మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఆరోగ్యశ్రీ తరుఫున నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌కు పెట్టిన బకాయిలు ఏకంగా రూ.680 కోట్లు. 
  • ఈ పరిస్థితిలో గత ప్రభుత్వం పెట్టిన అప్పులు తీర్చడంతో పాటు, ఆరోగ్యశ్రీ పరిధి విస్తరిస్తూ, ఈ ఏడాది జూన్‌ 16న మరో ఏడు జిల్లాలకు విస్తరించాం. 
  • కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలలో అమలు చేయగా, ఈరోజు మిగిలిన 6 జిల్లాలు.. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు వర్తింప చేశాం. కోవిడ్‌, పోస్ట్‌ కోవిడ్‌ చికిత్సను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చింది మన ప్రభుత్వం మాత్రమే. 
  • ఐసొలేషన్‌ వార్డు, కన్సల్టేషన్, మందులు, పరీక్షలు, ఆక్సిజన్, బలవర్థక ఆహారం, డిస్‌ఇన్ఫెక్షన్‌ చార్జీలను ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాటు చేశాం. 
  • 104కు ఫోన్‌ చేస్తే బెడ్‌ కేటాయించడంతో పాటు, ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఆ తర్వాత విశ్రాంతి సమయంలో కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాం. 

నాడు దుర్భర పరిస్థితులు 

  • ఈ రాష్ట్రంలో వైద్య పరంగా ఎదురవుతున్న ఇబ్బందులేమిటో స్వయంగా మనందరం చూశాం. గతంలో కళ్ల ముందు ఎన్ని సమస్యలు కనిపించినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు జిల్లా ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో నా కళ్లతో చూశాను. 
  • 108, 104 సర్వీసుల దుస్థితితో పాటు, వైద్యమే అందని గిరిజన ప్రాంతాలను, డయాలసిస్‌ కూడా అందని రోగులను చూశాను. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు అన్నీ బకాయిలే. చాలీచాలని మౌలిక సదుపాయాలు, సరిపడా లేని సిబ్బందితో నడిచే ఆస్పత్రులను చూశాను. 
  • ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోవడం, జనరేటర్‌ లేక ఆపరేషన్‌ థియేటర్లలో సెల్‌ఫోన్‌ వెలుగులో ఆపరేషన్లు చేయడం మనందరికీ తెలిసిందే. 

 పరిస్థితులు మార్చాం 

  • ఈ పరిస్థితులను మార్చేందుకు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 17 నెలల కాలంలోనే వేగంగా చర్యలు తీసుకున్నాం. వైద్యం, ఆరోగ్య పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాం.
  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని 130కి పైగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అర్హులకు ఆరోగ్యశ్రీ వర్తింప చేశాం. రాష్ట్రంలోని దాదాపు 95 శాతం కుటుంబాలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు, చికిత్స చేసే కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాం. 
  • ఆపరేషన్‌ చేయించుకున్న రోగులు ఇంటికి వెళ్లాక, వారు వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న సమయంలో రూ.5 వేల వరకు ఆర్థిక సహాయం, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, తలసేమియా, డయాలసిస్‌ రోగులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్‌ ఇస్తున్నాం. 
  • పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారుల రెండు చెవులకు కాక్లియర్‌ పరికరం అమర్చే పథకం, అన్ని రకాల క్యాన్సర్లకు, బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సలను సైతం ఈ పథకం కిందకు తెచ్చాం. 

నాణ్యతా ప్రమాణాలతో ఔషధాలు 

  • ప్రతి ఆస్పత్రిలో క్వాలిటీ వైద్య సేవలందేలా అడుగులు వేశాం. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల మందులతో రోగం నయం అవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. ఇవాళ 510 రకాల మందులు డబ్ల్యూహెచ్‌ఓ, జీఎంపీ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకువచ్చాం.
  • హెల్త్‌ రికార్డులతో అనుసంధానం అయిన క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కార్డులు జారీ చేశాం. ఇందులో రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. 

 ఆస్పత్రుల నిర్మాణం 

  • నాడు-నేడు ప్రారంభించి ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు సమూలంగా మార్చేస్తున్నాం. 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ క్లినిక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 1,147 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు, 191 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్ల రూపురేఖలు మారుస్తూ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నాం. 
  • ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక వైద్య కళాశాల, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 వైద్య కళాశాలలు ఉండగా, కొత్తగా 16 వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. 
  • 3 క్యాన్సర్‌ ఆస్పత్రులు, రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆస్పత్రులు మాత్రమే కాకుండా గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏల పరిధిలో 6 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాం. ఏకంగా 1088 కొత్త 104, 108 వాహనాలను రాష్ట్రం నలుమూలలకు పంపాం. 

వైద్య సిబ్బంది నియామకం

  • ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉండేలా కొత్తగా 9,712 మంది వైద్య సిబ్బంది నియామకం చేపట్టాం. రాష్ట్ర చరిత్రలో గతంలో ఏనాడూ ఇలా జరగలేదు. ఎక్కడా కొరత లేకుండా సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌ గతంలో, చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 
  • రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతం, ప్రతి గ్రామంలో ప్రతి 2 వేల జనాభా ఆరోగ్య అవసరాలు తీర్చే విధంగా గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్‌ల నుంచి మెడికల్‌ కాలేజీల వరకు అంచెల వారీ వ్యవస్థను రాష్ట్ర ప్రజల ముందుంచాం. ఆ దిశగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో టీచింగ్‌ ఆస్పత్రి, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. 

ఆరోగ్య ఆసరా -ఆరోగ్యమిత్రలు 

  • రోగి డిశ్చార్జ్‌ సమయంలోనే ఆరోగ్య ఆసరా పథకం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి ఆస్పత్రిలో ఆరోగ్యమిత్ర (హెల్ప్‌ డెస్క్‌)లు సదుపాయాలు, వసతులపై దృష్టి పెట్టాలి. 
  • గ్రామ, వార్డు సచివాలయాల్లోని హెల్త్‌ అసిస్టెంట్లు ఆరోగ్యశ్రీ పథకానికి రెఫరల్‌ పాయింట్‌గా ఉండాలి. వారు రోగులకు పథకం గురించి, ఆస్పత్రుల గురించి అవగాహన కల్పించి గైడ్‌ చేయాలి. వారు ఆ సహాయం చేస్తారని ప్రచారం కూడా చేయండి. 
  • ఆ మేరకు రోగులు ఏ ఆస్పత్రికి వచ్చినా, అక్కడ ఉండే ఆరోగ్యమిత్రలు వారికి అన్నీ చెప్పాలి. ఆ విధంగా వారికి ఉచిత వైద్యం, మెరుగ్గా అందించాలి. డిసెంబరు 10 నాటికల్లా ఈ వ్యవస్థ పక్కాగా ఉండాలి. ఆ మేరకు హోర్డింగ్‌లతో ప్రచారం చేయండి. 
  • కలెక్టర్‌ నెలకు కనీసం ఒకసారి, ఆరోగ్యశ్రీ చూసే జేసీలు కనీసం వారానికి ఒకసారి ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను సందర్శించాలి. ఆసరా కింద సాయం అందిస్తున్నారా లేదా.. సదుపాయాలు ఎలా ఉన్నాయి.. ఆరోగ్య మిత్రల సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. 
  • ఎక్కడ, ఏదన్నా లోపం జరిగితే దాన్ని సవరించాలి. ప్రజలకు అత్యంత మెరుగైన వైద్య సేవలందేలా చూడాలి. 

ఆరోగ్యశ్రీ యాప్ ఆవిష్కరణ

  • ఆరోగ్యశ్రీ యాప్‌ తెలుగు, ఇంగ్లిష్‌ వెర్షన్లను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులంతా ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ హెల్త్ రికార్డులు పరిశీలించుకోవాలని సీఎం జగన్‌ కోరారు.
  • ప్రతి ఒక్కరికీ సులువుగా అర్థమయ్యేలా యాప్ రూపొందించారు. ఈ పథకంలో ఎవరు, ఎక్కడ చికిత్స పొందినా యాప్‌లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. హెల్త్ రికార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.  
  • యాప్‌లో కోవిడ్ చికిత్స పై పూర్తి సమాచారం ఉంటుంది. ఆస్పత్రుల జాబితా, వాటి చిరునామా, ఫోన్ నంబర్లు, కోఆర్డినేటర్ల వివరాలు, ఆయా ఆస్పత్లుల్లో అందుబాటులో ఉన్న చికిత్సల వివరాలు కూడా ఉన్నాయి. 
  • ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top