ఉన్నత విద్య పరిపుష్టానికి ప్రత్యేక ప్రణాళిక మండలి

Special Planning Board for Higher Education Reinforce - Sakshi

సీఎం జగన్‌ సూచనలతో కీలక సంస్కరణలు

ప్రఖ్యాత విద్యాసంస్థల భాగస్వామ్యంతో పరిశోధనలు

వర్సిటీల మధ్య ఫ్యాకల్టీ, విద్యార్థుల ఎక్స్చేంజ్‌

ఉన్నత విద్యామండలిలో క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌

సాక్షి, అమరావతి: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నత విద్యారంగాన్ని పరిపుష్టం చేయడంలో భాగంగా ప్రత్యేక ప్రణాళిక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని కేంద్ర విద్యాసంస్థల ప్రముఖులు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఇతర విద్యావేత్తలతో ఈ బోర్డు ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు. 

నిపుణుల మార్గదర్శకత్వంలో.. 
► రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా బోర్డు మార్గనిర్దేశం చేస్తుంది. విద్యాసంస్థలకు వనరులు, మౌలిక సదుపాయాలు, అభ్యాసన వ్యవస్థలు, ఉత్తమ పద్ధతులు, వినూత్న బోధనా విధానాలతో ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం బోర్డు లక్ష్యం. 
► జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్రంలోని విద్యాసంస్థలను అనుసంధానిస్తుంది. 
► రాష్ట్రంలోని కేంద్ర విద్యా పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల డైరెక్టర్లు, వీసీలు సభ్యులుగా ఉంటూ ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తారు. కేంద్ర సంస్థలతో రాష్ట్ర విశ్వవిద్యాలయాల మార్గదర్శకత్వం దేశంలో ఇదే తొలిసారి. కేంద్ర విద్యాసంస్థలు, రాష్ట్ర వర్సిటీల మధ్య అధ్యాపక మార్పిడి కార్యక్రమాలను బోర్డు  చేపడుతుంది. 

పేటెంట్స్‌ లభించేలా ప్రోత్సాహం.. 
► రాష్ట్రస్థాయిలో రీసెర్చ్‌ బోర్డు ఏర్పాటు ద్వారా వర్సిటీల్లో నాణ్యమైన పరిశోధనా సంస్కృతిని ప్రోత్సహిస్తారు. పేటెంట్లు లభించేలా పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచుతారు. 
► గ్రూపులవారీగా ఇంటర్‌ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహిస్తారు. 
► దేశ విదేశాల్లోని రీసెర్చ్‌ సంస్థలు, నిధులు అందించే ఏజెన్సీలు,  పరిశ్రమలతో ఈ పరిశోధనలను అనుసంధానం చేస్తారు. 

 క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌.. 
► విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలను ఇది ప్రోత్సహిస్తుంది 
► జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌ కోసం పోటీపడేలా సహకారం అందిస్తుంది. 
► 2025 నాటికి 50 శాతం ఉన్నత విద్యాసంస్థలు అక్రిడిటేషన్‌ పొందడమే లక్ష్యంగా పని చేస్తుంది. 
► ఇదే కాకుండా రాష్ట్ర ఉన్నత విద్యా డేటా సెంటర్‌ ఏర్పాటు కానుంది. ఉన్నత విద్యపై కచ్చితమైన, పూర్తి డేటాను అందించేందుకు డేటా పోర్టల్‌ దోహదం చేస్తుంది. 

ఉత్తమ విధానాలను అనుసరిస్తాం.. 
‘రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌ ద్వారా అక్రిడిటేషన్, ర్యాంకులకు సంబంధించిన సహాయ సహకారాలు అందిస్తున్నాం. రాష్టస్థాయిలో 130 మందితో ఏర్పాటైన బృందం మెంటార్లుగా వ్యవహరిస్తూ న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్, ఎన్‌బీఏతో సహా ఇతర ప్రఖ్యాత సంస్థల గుర్తింపు కోసం సహకారం అందిస్తుంది. ఐఐటీ, ఐఐఎం తదితర జాతీయ విద్యాసంస్థల్లోని ఉత్తమ విధానాలను అనుసరిస్తాం. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఇంటర్‌ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ను ప్రోత్సహిస్తాం’  
– ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top