ప్రభుత్వ కార్యనిర్వాహక హక్కులను హైకోర్టు లాక్కుంది

Special Leave Petition Of AP Govt In Supreme Court - Sakshi

అతిథి గృహం నిర్మించాలా? వద్దా? అనే అధికారం తనదేనని హైకోర్టు భావిస్తోంది

దీన్ని నిర్ణయించే పరిధి హైకోర్టుకు లేదు.. 

న్యాయమూర్తులు చక్రవర్తులుగా భావించరాదని సుప్రీంకోర్టు చెప్పింది

‘విశాఖ అతిథిగృహం’ మీద హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వండి.. 

సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో అతిథి గృహం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలను ఏపీ హైకోర్టు పూర్తిగా లాగేసుకుందని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఒక అతిథి గృహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయించే నిర్ణయాధికారం తనకే ఉన్నట్లు హైకోర్టు భావిస్తోందని.. ఇది సబబు కాదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తాజాగా స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా అతిథి గృహం అంశాన్ని నిర్ణయించే పరిధి హైకోర్టుకు లేదంది. రాజ్యాంగం ప్రకారం.. సమాన అధికారం, హక్కులు కలిగిన మిగిలిన వ్యవస్థలను గౌరవించాలని.. ఆ వ్యవస్థల అధికారాలను తన అధికారాలుగా భావించకూడదంటూ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చేసిన హెచ్చరికలను హైకోర్టు పూర్తిగా విస్మరించిందని తెలిపింది. 

రాజ్యాంగ సమానత్వాన్ని హైకోర్టు కాలరాసినట్లు కాదా?
న్యాయమూర్తులు తమ పరిధులను తెలుసుకోవాలని.. చక్రవర్తుల్లా భావించరాదని, ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేయరాదని పలు కేసుల్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ కార్యనిర్వాహక హక్కులను హైకోర్టు లాక్కోవడం ఆమోదయోగ్యమా? అని ప్రశ్నించింది. హైకోర్టు  ఉత్తర్వులు ఆరావళి గోల్ఫ్‌ కోర్స్‌ వర్సెస్‌ చంద్రహాస్‌ అండ్‌ అదర్స్‌ కేసులో సుప్రీంకోర్టు చెప్పినదానికి విరుద్ధం కాదా? రాజ్యాంగం నిర్దేశించిన సమాన వ్యవస్థల మధ్య ఉండాల్సిన రాజ్యాంగ సమానత్వాన్ని హైకోర్టు కాలరాసినట్లు కాదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయంది.

రాజ్యాంగ వ్యవస్థల స్వతంత్రత, బలం మీదే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉందన్న విషయాన్ని హైకోర్టు విస్మరించిందని ఆక్షేపించింది. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. విశాఖలో ప్రభుత్వం అతిథి గృహం నిర్మిస్తోందని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 2న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు నిర్మాణాలు తప్ప, మిగిలిన నిర్మాణాలను కొనసాగించవచ్చునని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top