మసాజ్‌ సెంటర్ల పేరుతో చీకటి కార్యకలాపాలు.. ఆ కార్డు ఉంటే ధరలో రాయితీ..

Police Raid on Massage Parlours in Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని పలు స్పాలపై ఇటీవల పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కళ్లు బైర్లుకమ్మే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరి కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకుండా స్పాలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. పలు మసాజ్‌ సెంటర్ల నిర్వాహకులు లోపల జరుగుతున్న చీకటి కార్యకలాపాలు వెలుగులోకి రాకుండా నిర్వహణలోనే జాగ్రత్తలు తీసుకున్నారు.

బయోమెట్రిక్‌ ద్వారానే ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు తనిఖీలకు లోపలకు వెళ్లేలోగా అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అనుమతి లేని మసాజ్‌ సెంటర్లను వెంటనే మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అన్ని స్పాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ప్రాథమికంగా తనిఖీలు చేపట్టామని, రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా ‘సాక్షి’కి తెలిపారు.  

అంతా బయోమె‘ట్రిక్కే’...! 
స్పాల ఏర్పాటు చేసుకోవడం చట్ట పరిధిలోనే ఉంది. మానసిక, శారీరక ఒత్తిళ్లను తగ్గించేందుకు శాస్త్రీయమైన పద్ధతిలో మసాజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సదరు థెరపిస్టులకు శిక్షణ కూడా ఉంటుంది. అయితే, నగరంలోని కొన్ని మసాజ్‌ కేంద్రాల్లో ఇందుకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. మసాజ్‌ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో స్పా నిర్వాహకులు కాస్తా పోలీసులు నేరుగా లోపలికి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ బయోమెట్రిక్‌ను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం స్పాకు చెందిన వారు మినహా ఎవరైనా లోపలికి ప్రవేశించాలంటే కచ్చితంగా బయోమెట్రిక్‌ ఉపయోగించాల్సిందే. తాజాగా పోలీసుల తనిఖీల్లో కూడా ఈ స్పాల లోపలకు ప్రవేశించేలోగా మొత్తం వ్యవహారాలన్నీ చక్కదిద్దుకున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా సదరు మసాజ్‌ నిర్వాహకులు సభ్యత్వ కార్డును కూడా తమ వినియోగదారులకు ఇస్తున్నారు. ఈ కార్డు ఉన్నవారికి మసాజ్‌ ధరలో రాయితీ కూడా ఇస్తున్నారు.  

ఇతర రాష్ట్రాల నుంచి.. 
నగరంలోని పలు మసాజ్‌ సెంటర్లలో రాష్ట్రానికి చెందిన అమ్మాయిల కంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తరాదితో పాటు ఈశాన్య రాష్ట్రానికి చెందిన అమ్మాయిలను తీసుకొస్తున్నారు. వారికి వసతి కూడా కొన్ని మసాజ్‌ సెంటర్ల నిర్వాహకులు కల్పించారని తెలుస్తోంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో కనీసం అనుమతి లేకుండా కూడా మసాజ్‌ సెంటర్ల నిర్వహణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా తనిఖీలతో ఫోర్త్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మేఘనాథ్‌ స్పాను మూసేశారని పోలీసు అధికారులు తెలిపారు. అనుమతి లేని మసాజ్‌ సెంటర్లను మూయించడంతో పాటు  ఇతర సెంటర్లల్లో  అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.  

నిరంతరాయంగా తనిఖీలు 
విశాఖ కమిషనరేట్‌ పరిధిలోని మసాజ్‌ (స్పా) సెంటర్లలో కొద్దిరోజుల కిందట తనిఖీలు చేపట్టాం. అనుమతి లేని మసాజ్‌ సెంటర్లను వెంటనే మూసివేయాలని ఆదేశించాం. ఇక అనుమతి ఉన్నవాటిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.  
 – మనీష్‌కుమార్‌ సిన్హా, పోలీసు కమిషనర్‌   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top