అమరావతి రైతులకు కౌలు సొమ్ము జమ

Minister Botsa Satyanarayana Fires On Chandrababu - Sakshi

వార్షిక కౌలు రూ.158 కోట్లు, 2 నెలల పింఛను రూ. 9.73 కోట్లు ఇచ్చాం

అసలైన రైతులకే కౌలు చెల్లింపు ఉంటుంది..

పింఛన్‌ పెంపునకు దుష్టశక్తుల ఆటంకం రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అడ్డు

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స

సాక్షి, అమరావతి/విజయనగరం: భూసమీకరణ పథకం కింద రాజధాని అమరావతి రైతులకు వార్షిక కౌలు, పేదలకు పింఛన్లు విడుదల చేసినట్లు మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకివ్వాల్సిన వార్షిక కౌలు రూ.158 కోట్లు, పేదలకు రెండు నెలల పింఛను మొత్తం రూ.9.73 కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో భూములిచ్చిన కౌలు రైతులకు కౌలు, పింఛన్‌ రాలేదంటూ ధర్నా చేయడంపై స్పందించారు. 
బుధవారం రైతుల బ్యాంకు ఖాతాల్లో కౌలు జమ చేసినట్లు వెల్లడించారు. 
ఏటా జూలై, ఆగస్టు నెలల్లోనే కౌలు, పింఛన్‌ డబ్బులు జమచేయడం జరుగుతుందన్నారు.
సుమారు 7 నుంచి 10 వేల మంది వారి భూములను అమ్ముకున్నారని, భూ హక్కుపత్రాలను అమ్ముకున్న రైతులకు కౌలు ఉండదని, దీనికి సంబంధించిన సర్వే జరుగుతోందని చెప్పారు. 
నిజమైన రైతులకు మాత్రమే కౌలు అందుతుందన్నారు. రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ. 2,500 పింఛన్‌ను రూ. 5,000 చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించగా కొన్ని దుష్టశక్తులు కోర్టును ఆశ్రయించి ఆటంకం కల్పించాయన్నారు. 
ప్రతిపక్ష టీడీపీ రాష్ట్ర అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు

ప్రభుత్వం సంకల్పిస్తే.. కోర్టుల ద్వారా అడ్డుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతోందని దుయ్యబట్టారు. పేదలకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. పేదోడికి అందే సాయానికి అడ్డుపడవద్దని ప్రతిపక్ష నేతలకు హితవుపలికారు. జూలై 8 నాటికి ఇస్తామన్న పట్టాల పంపిణీ ఆలస్యమైందని, ఇంకా ఆలస్యం జరిగితే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మీడియా సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఉన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top