ఎక్కువ శాతం కరోనా మరణాలు ఆందోళనతోనే

A High Percentage Of Corona Deaths Are Of Anxiety - Sakshi

హైపర్‌ కార్బియాకు లోనవుతున్న పాజిటివ్‌ రోగులు

ఫలితంగా ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్న వైనం

మనోధైర్యమే సగం బలమని చెబుతున్న వైద్యులు

భయం వీడితే ప్రాణాలు కాపాడుకోవచ్చంటూ సూచనలు

విజయవాడకు చెందిన 40 ఏళ్ల సాయిరామ్‌ కరోనా పాజిటివ్‌ రావడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. జ్వరం, ఇతర లక్షణాలు లేకున్నా.. ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేరాడు. అక్కడ నిరంతరం బంధువులు, స్నేహితులతో ఫోన్‌లలో మాట్లాడుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఆందోళన తీవ్రతరం కావడంతో క్రమేణా ఆక్సిజన్‌ లెవెల్స్‌ తగ్గుతూ వచ్చాయి. ఐదు రోజుల చికిత్స అనంతరం ఊపిరి వదిలాడు. 

నున్న గ్రామానికి చెందిన 38 ఏళ్ల కోటికి వారం రోజుల కిందట పాజిటివ్‌ వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం కోవిడ్‌ ఆస్పత్రిలో చేరాడు. అక్కడ తీవ్ర ఆందోళనకు గురవుతూ, తనకేదో అయిపోతుందని ఫోన్‌లు చేస్తూ ఆందోళన చెందాడు. ఆక్సిజన్‌ క్యాప్‌ను సైతం పక్కకు తొలగించి నిరంతరం ఫోన్‌లు మాట్లాడటంతో సమస్య తీవ్రమై మృత్యువాత పడ్డాడు. 

సాక్షి, విజయవాడ: ఇలా వీరిద్దరే కాదు. కరోనా పాజిటివ్‌ వారిలో 90 శాతం మంది తీవ్ర ఆందోళనకు గురై.. తేలికగా బయటపడే పరిస్థితి నుంచి మరణానికి చేరువవుతున్నారు. ఈ ఏప్రిల్‌ నెలలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 64 మంది కరోనాతో మృతి చెందారు. వీరిలో సగం మంది ఆందోళనతోనే వ్యాధి తీవ్రతరమైన మరణించినట్లు వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఆందోళన చెందకుండా, మనోధైర్యంతో చికిత్స పొందితే, వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చని సూచిస్తున్నారు.

హైపర్‌ కార్బియా సమస్య..
సాధారణంగా ఒక వ్యక్తి నిమిషానికి 12 నుంచి 16 సార్లు శ్వాస తీసుకుంటాడు. కానీ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కంగారులో ఎక్కువసార్లు శ్వాస తీసుకోవడం వల్ల అవసరమైన ఆక్సిజన్‌ అందడం లేదు. దీంతో రక్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ లెవెల్స్‌ పెరిగి హైపర్‌ కార్బియా సమస్యకు దారితీస్తోంది. ఈ ప్రభావం బ్రెయిన్‌పై పడి స్పృహ కోల్పోవడం, హార్ట్‌ అటాక్‌ రావడం, వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాక కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టే గుణం ఉంటుంది. ఆందోళనలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఆ సమయంలో రక్తంలో గడ్డలు అడ్డుపడి హార్ట్‌అటాక్, బ్రెయిన్‌ ఫెయిల్యూర్, సడన్‌గా కొలాప్స్‌ అవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాక హార్మోన్స్‌ ఇన్‌బ్యాలెన్స్‌ అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. 

పాజిటివ్‌ దృక్పథంతో ఉండాలి..
కరోనా పాజిటివ్‌ వచ్చినా మంచి వైద్యం పొందితే నయం అవుతుందనే పాజిటివ్‌ దృక్పథంలో చికిత్స పొందాలి. ఆందోళన చెందకుండా, బ్రీతింగ్‌ ఎక్సైర్‌సైజ్‌లు చేయడం, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం చేయాలి. ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతుంటే నిరంతరం ఆక్సిజన్‌ లెవెల్స్‌ పరీక్షించుకోవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం ఎంతో అవసరం. ఆత్మస్థైర్యంతో చికిత్స పొందితే చాలా మందిలో ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా కరోనా నయం అవుతుంది. 

చదవండి: 100 కోట్ల సినిమా కంటే ఇదే ఎక్కువ సంతృప్తి: సోనూసూద్‌

మనోస్థైర్యమే అతిపెద్ద ఔషధం..
పాజిటివ్‌ వచ్చిన వారు ఎక్కువగా ఆందోళన చెందడంతో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి. ఒత్తిడితో హార్మోన్స్‌ ఇన్‌బ్యాలెన్స్‌ అవడంతో ఆక్సిజన్‌ సపోర్టు పెట్టినా కొందరిలో నార్మల్‌ పరిస్థితి రావడం లేదు. కరోనా సోకిన వారిలో రక్తం గడ్డ కట్టడం, రక్తకణాలు చిట్లిపోవడం, ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ తీసుకునే స్థాయి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పాజిటివ్‌ దృక్పథంతో మనోస్థైర్యంతో చికిత్స పొందితే కొంత వరకు సమస్యను అధిగమించవచ్చు. ఇంతకు ముందులాగా కాకుండా సెకండ్‌వేవ్‌ కొత్త వైరస్‌ కొంత తీవ్రంగా ఉంది. ఎక్కువ మందికి ఆక్సిజన్‌ అవసరం అవుతోంది.
– డాక్టర్‌ సొంగా వినయ్‌కుమార్, క్రిటికల్‌కేర్‌ నిపుణుడు, కోవిడ్‌ స్టేట్‌ ఆస్పత్రి 

హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్నా..
నాకు పదిహేను రోజుల కిందట కరోనా పాజిటివ్‌ రాగా హోమ్‌ ఐసోలేషన్‌లోనే ఉన్నా. వారం రోజుల తర్వాత సీటీ స్కాన్‌ చేయించుకుంటే కోరాడ్స్‌ 5 అని ఇచ్చారు. ఒక వైద్యుడిని సంప్రదిస్తే, కొంత సీరియస్‌గానే ఉందని చెప్పారు. నాకు ఎలాంటి ఇబ్బంది లేక పోవడంతో ఆత్మస్థైర్యంతో ఇంట్లోనే ఉండి మందులు వాడాను. లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉండటంతో యాంటిబయోటిక్స్‌తో పాటు, స్టిరాయిడ్స్‌ కూడా వాడటంతో వారం రోజుల్లో నార్మల్‌ పరిస్థితికి వచ్చింది. మంచి ఆహారం తీసుకుంటూ, వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ, హోమ్‌ ఐసోలేషన్‌లో ఎలాంటి ఆందోళన లేకుండా పద్నాలుగు రోజులు గడిపి కరోనాను జయించా.
– ప్రసాద్, ఆర్టీసీ ఉద్యోగి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top