పేదల ఇళ్లు.. నాణ్యత వర్ధిల్లు

Government Decided To Build Houses For 30 Lakh Poor People In Next 3years - Sakshi

పటిష్టంగా నిర్మించేలా ఇంజనీర్లకు ప్రత్యేక శిక్షణ

నిర్మాణాలకు ఉపయోగించే పరికరాల కోసం టెండర్లు

ఎనర్జీ ఎఫీషియెంట్, థర్మల్లీ కంఫర్టబుల్‌ టెక్నాలజీ వినియోగంతో 20 శాతం విద్యుత్‌ ఆదా

పట్టాలు పంపిణీ చేసిన వెంటనే ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళిక

మొదటి విడతగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం

సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణంలో ఖర్చు ఆదా అయ్యేలా.. ఇళ్లు అత్యంత నాణ్యంగా, పటిష్టంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. నిర్మాణాలకు ఉపయోగించే సెంట్రింగ్‌ మెటీరియల్‌తో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. నిర్మాణాలను పర్యవేక్షించే ఇంజనీర్లు, తాపీ పని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు తిరుపతి ఐఐటీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. మూడున్నరేళ్లలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఈ ఏడాది 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగానే ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా నిర్మాణాలు చేపట్టనున్నారు.

దేశంలోనే తొలిసారిగా ఈఈటీసీ సాంకేతికత
దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ ఎఫీషియెంట్, థర్మల్లీ కంఫర్టబుల్‌ (ఈఈటీసీ) టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ విధానంలో నిర్మించే ఇళ్లల్లో 4 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా. దీనివల్ల 20 శాతం విద్యుత్‌ ఆదా అవుతుంది. మరోవైపు ప్రతి ఇంటికీ 3 ఎల్‌ఈడీ బల్బులు, 2 ట్యూబ్‌లైట్లు, 2 ఇంధన సామర్థ్య ఫ్యాన్లను అమర్చుతారు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లకు ఈఈటీసీ టెక్నాలజీ ఉపయోగిస్తే దేశంలోనే ఏపీ రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని కేంద్ర ఇంధన పొదుపు సంస్థ అధికారులు భావిస్తున్నారు. 

సెంట్రింగ్‌ మెటీరియల్‌ సరఫరాకు టెండర్లు
పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండటంతో పనులు ఆలస్యం కాకుండా చూసేలా సెంట్రింగ్‌, ఇతర మెటీరియల్‌ సరఫరాకు గృహ నిర్మాణ సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచింది. తలుపులు, కిటికీలు వంటి వాటిని తక్కువ ధరకు సరఫరా చేస్తారు. ఇటుకలు, ఇనుప కడ్డీలు, విద్యుత్‌ పరికరాలు, శానిటరీ వస్తువులు, రంగులు తదితర వాటిని మార్కెట్‌ ధర కంటే తక్కువకు పొందేలా కంపెనీలతో ఒప్పందం చేసుకునేలా విడిగా టెండర్లు పిలిచారు. మరోవైపు గ్రామ, పట్టణ పరిధిలో తాపీ మేస్త్రిలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు ఎంతమంది అందుబాటులో ఉన్నారనే వివరాలను ఇప్పటికే సేకరించారు. వారంతా తమ వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు వీలుగా గృహ నిర్మాణ సంస్థ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇళ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు టెక్నికల్‌ కమిటీని నియమించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సి.మల్లిఖార్జునరావు చెప్పారు.

ఈ ఏడాది రూ.6,190 కోట్లు కేటాయింపు
పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.6,190.33 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పేదలకు ఇంటి స్థలం పట్టా ఇచ్చిన వెంటనే ఇంటి నిర్మాణం చేపడతాం.
- చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి

జిల్లాల వారీగా తొలి విడతలో కేటాయింపులు ఇలా..

జిల్లా  ఇప్పటివరకు కేటాయించిన ఇళ్లు
శ్రీకాకుళం    56,608
విజయనగరం  51,767
విశాఖ  1,70,912
తూర్పు గోదావరి  2,40,100
పశ్చిమ గోదావరి 1,54,855
కృష్ణా 1,75,939
గుంటూరు         1,58,710
ప్రకాశం    70,990
నెల్లూరు   42,539
చిత్తూరు      1,41,087
వైఎస్సార్‌   76,445
అనంతపురం  1,01,310
కర్నూలు 58,738
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top