డాలర్ శేషాద్రికి అంతిమ వీడ్కోలు

హరిశ్చంద్ర శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు
నివాళులర్పించిన ప్రముఖులు
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) పార్థివ దేహానికి మంగళవారం మధ్యాహ్నం అంతిమ వీడ్కోలు పలికారు. హరిశ్చంద్ర శ్మశాన వాటికలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. శేషాద్రికి సంతానం లేకపోవడంతో అతని చిన్న తమ్ముడు రామానుజన్ తలకొరివి పెట్టారు. అంతిమ యాత్రలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయకల్లం, టీటీడీ పాలకమండలి సభ్యుడు పోకల అశోక్‌కుమార్, మాజీ జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన సుప్రీంకోర్టు సీజే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మంగళవారం మధ్యాహ్నం డాలర్ శేషాద్రి గృహానికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, టీటీడీ పాలకమండలి సభ్యులు వైద్యనాథన్, కృష్ణమూర్తి, చెన్నై స్థానిక సలహా మండలి చైర్మన్ శేఖరరెడ్డి, జేఈవో సదాభార్గవి, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ జేఈవోలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజు, తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్, టీటీడీ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు శేషాద్రి పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
పాడె మోస్తున్న ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి
శేషాద్రి మరణం తీరని లోటు : జస్టిస్ ఎన్వీ రమణ
‘తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రితో నాకు 25 ఏళ్ల అనుబంధం ఉంది. శేషాద్రి మరణం నాకు, నా కుటుంబానికి తీరని లోటు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరుమలకు సంబంధించిన విశేషాలు, సేవలు, ఉత్సవాల విశిష్టతను భక్తులకు ఆయన చాలా చక్కగా వివరించే వారన్నారు. 43 ఏళ్లుగా శ్రీవారి సేవ చేస్తూ తుదిశ్వాస కూడా స్వామి సేవలోనే విడవడం ఆయన పూర్వజన్మ సుకృతమన్నారు. తిరుమలలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాలు, సేవలకు సంబంధించిన విషయాలతో శేషాద్రి క్రోడీకరించిన పుస్తకాన్ని టీటీడీ ముద్రించి భవిష్యత్ తరాల వారికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. శేషాద్రి లేని తిరుమలను ఊహించుకోలేనని, శ్రీవేంకటేశ్వర స్వామి వారు శేషాద్రి ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఆయన చివరి కోరికను శ్రీవారు తీర్చారు: వైవీ సుబ్బారెడ్డి
శ్రీవేంకటేశ్వర స్వామి సేవలోనే తనువు చాలించాలనుకున్న శేషాద్రి కోరికను స్వామివారే తీర్చారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శేషాద్రితో తనకు పాతికేళ్ల అనుబంధం ఉందని చెప్పారు. శేషాద్రి కుటుంబానికి టీటీడీ అండగా ఉంటుందన్నారు.
శేషాద్రి లోటు తీరనిది : జవహర్‌రెడ్డి
శ్రీవారి సేవలో నిరంతరం గడిపిన శేషాద్రి లేని లోటు తీరనిదని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అన్నారు. 43 ఏళ్లపాటు శ్రీవారి సేవలో పాల్గొని స్వామి సేవలోనే పరమపదించిన ధన్యజీవి శేషాద్రి అన్నారు. ఆలయంలో నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల సేవలు, ఉత్సవాల నిర్వహణలో అర్చకులు, జియ్యంగార్లు, అధికారులకు సంధానకర్తగా వ్యవహరించారని చెప్పారు.