‘బాకా’ బృందం.. ‘కాకా’ కథనం | Sakshi
Sakshi News home page

‘బాకా’ బృందం.. ‘కాకా’ కథనం

Published Wed, Nov 29 2023 5:49 AM

Eenadu distortion story under the guise of Citizens for Democracy - Sakshi

సాక్షి, అమరావతి: అదొక తెలుగుదేశం పార్టీ బాకా బృందం. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) ముసుగులో ఉన్న ఈ బృందంలో అందరూ చంద్రబాబు మనుషులే. పెత్తందార్ల పెద్ద ఈనాడు రామోజీరావే ఈ బాకా బృందానికీ కాకా. ఇంకేముంది? చంద్రబాబు, రామోజీ నుంచి ఆదేశాలు రాగానే గుడ్డలు చించు­కోవడం మొదలెట్టారు. రాష్ట్రంలో ఓటర్ల సవరణ, వై నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాలపై గొంతులు చించుకుంటున్నారు. వీటిపై ఎన్నికల సంఘానికీ వినతిపత్రాలు ఇస్తున్నారు. వీరి పేరుతో పెత్తందార్ల పెద్ద రామోజీరావు వక్రీకరణలతో ఓ అక్కసు కథ అచ్చేశారు.

ఇందులో వారి లక్ష్యం స్వయంకృషితో ప్రభు­త్వ ఉద్యోగాలు సాధించి, సచివాలయాల్లో పనిచేస్తున్న బడుగు, బలహీనవర్గాలేనన్నది సుస్పష్టం. ఓటర్ల జాబితా బాధ్యతలు సచివాలయ సిబ్బందికా అంటూ సీఎఫ్‌డీలోని బాబు బృందంతో పాటు ఈనాడులో రామోజీ గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులైన సచివాలయ సిబ్బందికి కాక ఇంకెవరికి అప్పగించాలి? సీఎఫ్‌డీలోని బాబు బృందానికి, రామోజీకి అప్పగించాలా? ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందా? 

ప్రభుత్వ ఉద్యోగులైన రెవెన్యూ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శులు బూత్‌ లెవెల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వోలు)గా ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నారు. ఈ ఉద్యోగులు పనిచేస్తున్నదీ సచివాలయాల్లోనే. వారు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓటర్లు జాబితా సవరణ చేపడుతున్నారు. గతంలో బీఎల్‌వోలుగా అంగన్‌వాడీ వర్కర్లు, గ్రామ స్థానిక వర్కర్లు, ఏఎన్‌ఎంలు ఉండే వారు.

ఇప్పుడు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా సీఎఫ్‌డీలోని పెద్దలు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టడం పెద్ద నేరం, ఘోరం అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాన్ని భూతద్దంలో చూపెడుతూ ఈనాడు రామోజీ కథనం రాయడం ఓ విడ్డూరం. ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ సిబ్బందిని కించపరచడమేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. 

సీఎఫ్‌డీ సొంత భాష్యం 
ఓటర్ల జాబితా సవరణ బాధ్యతల్లో సచివాలయ సిబ్బందిని కొనసాగించడం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వైఫల్యం అంటూ సీఎఫ్‌డీ సొంత భాష్యం చెప్పింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను టీచర్లకు అప్పగించాలంటూ సీఎఫ్‌డీ పెద్దలు వారి అజ్ఞానాన్ని, వైఫల్యాన్ని బహిర్గతం చేసుకున్నారు. ఉపాధ్యాయులను బోధనకు తప్ప ఇతర పనులకు వినియోగించరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందనే విషయం సీఎఫ్‌డీ పెద్దలకు తెలియదా? లేక తెలిసే టీచర్లకు అప్పగించాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారా?  

ప్రభుత్వ వ్యవస్థకు రాజకీయ రంగా? 
ప్రభుత్వ వ్యవస్థ అయిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థకు రాజకీయ రంగు పులిమేందుకు సీఎఫ్‌డీ పెద్దలు, రామోజీ ఇలాంటి వక్రీకరణలకు పాల్పడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినంతమాత్రాన సచివాలయాల వ్యవస్థను పార్టీకి అంటగడతారా? గతంలో ఎన్టీఆర్‌ మండల వ్యవస్థను ఏర్పాటు చేస్తే దాన్నీ ఆ పార్టీకి అంటగడతారా? ఈ వ్యవస్థలను పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు సేవలను చేరువ చేయడానికి ఏర్పాటు చేసినవిగా చూడాలి తప్ప మరోలా కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.  

వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర తరహాలోనే ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు వివరించడానికి వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర నిర్వహిస్తోంది. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ, వార్డు సచివాలయాలు, పంచాయతీల వారీగా వివరించడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాలను మొబైల్‌ వ్యాన్ల ద్వారా స్క్రీన్లపై ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగమే పాల్గొంటోంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర స్థాయిలో సీఎస్, జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ల నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నందున ఆయన సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఇదే తరహాలో వై నీడ్స్‌ జగన్‌ అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికార యంత్రాంగం ప్రజలకు వివరిస్తోంది. ఇందులో తప్పేమి ఉంది? సీఎంగా జగన్‌ ఉన్నందున ఆయన పేరుతో కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇదేదో మహా నేరం అయినట్లు చిత్రీకరించడం సీఎఫ్‌డీ పెద్దలు, రామోజీ కడుపు మంటే తప్ప మరేదీ కాదు. వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో అధికారులతో పాటు కేంద్ర మంత్రులు, నాయకులు కూడా పాల్గొంటున్నారు.

రాష్ట్రంలో కూడా అధికారులు, ఉద్యోగులతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇదేదో సివిల్‌ సర్విస్‌ కోడ్‌కి విఘాతం అంటూ సీఎఫ్‌డీ పెద్దలు తెగ బాధపడిపోవడం విచిత్రంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం అనైతికం, అధర్మం అంటూ ఆ పెద్దలు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంపై పల్లెత్తు మాట అనని ఈ ‘పెద్దలు’ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని తప్పు పట్టడానికి మాత్రం ముందుంటారు. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై వారికున్న కడుపు మంటకు ఇదే నిదర్శనం. 

రామోజీకి, బాబుకు భజన బృందమే సీఎఫ్‌డీ పెద్దలు
పేరుకు సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సీఎఫ్‌డీ) అంటూ పేరు పెట్టుకుని తెలుగుదేశం  పార్టీకి, ఈనాడు రామోజీకి, ఎల్లో మీడియాకు అనుకూలంగా వ్యవహరించడమే సీఎఫ్‌డీ పెద్దల రాజకీయం. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి మేలు చేయడానికి కోవిడ్‌ సాకుతో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేపింది నిమ్మగడ్డ అనే విషయం ప్రజలు మరచిపోలేదు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అంటే గిట్టని వారు సీఎఫ్‌డీలో చేరి ఎన్నికల ముందు తెలుగుదేశం అనుకూల రాజకీయాలు చేస్తున్నారు. రామోజీ, చంద్రబాబు డైరెక్షన్‌లో ఇలాంటి వక్రీకరణలకు మున్ముందు మరిన్నింటికి పాల్పడతారు. తెలుగుదేశానికి అనుకూలంగా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగానే సీఎఫ్‌డీ పుట్టుకొచ్చింది తప్ప ఇందులో పౌరుల ప్రయోజనాలపై వారికేమీ ఆసక్తి లేదనేది సుస్పష్టం.  

వారు ప్రభుత్వ ఉద్యోగులే 
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను చట్టబద్దంగా ఏర్పాటు చేశారు. ఏపీ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ నిర్వహించిన పరీక్షల ద్వారా ఎంపికయ్యా­రు. వీరికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే సర్వీసు రూల్స్‌ వర్తిస్తాయి. వీరంతా శాశ్వత ఉద్యోగులే. ప్రభుత్వ వేతనాలు పొందుతున్నారు. అలాంటి ఉద్యోగుల పట్ల బాబు సీఎఫ్‌డీ బృందానికి, రామోజీకి కడుపు మంట ఎందుకో! నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఉద్యోగులు పనికి రారంటూ సీఎఫ్‌డీతో పాటు రామోజీ నిందించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం.

సచివాలయాల ఉద్యోగులందరూ ఉన్నత విద్యావంతులే. అలాంటి ఉద్యోగులను తక్కువ చేసి చూడటం తగదని అధికారవర్గాలు అంటున్నాయి. ఓటర్ల జాబితాలో పొరపాట్లు  2019 ఎన్నికల సమయంలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సచివాలయ సిబ్బంది చేసినవి కాదు. గతంలోనే సీఈవో ఓటర్ల జాబితాలో పొరపాట్లను క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా సరిచేశామని ప్రకటించారు.  

Advertisement
 
Advertisement